
హైదరాబాద్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్‌ఎల్)లోకి అడుగుపెట్టాడు. తాజా సీజన్ కోసం అతను హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఐఆర్‌ఎల్‌లో భాగంగా ఫార్ములా 4 ఇండియన్ చాంపియన్‌షిప్ ఈ నెల 24 నుంచి మొదలవుతుంది. ఈ రేస్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని నాగ చైతన్య తెలిపారు.
ఫార్ములా–1, సూపర్ కార్లు, మోటార్ సైకిళ్లను అమితంగా ఇష్టపడే చైతన్య మోటార్ స్పోర్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రేసింగ్ టీమ్‌ను కొనుగోలు చేశాడు. ‘మోటార్ స్పోర్ట్స్‌లో భాగం కావాలని నేను ఎప్పట్నించో చూస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను తీసుకున్నా. మోటార్ స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కు ఐఆర్‌ఎల్ మంచి అనుభూతిని అందిస్తుంది. నైపుణ్యం గల వారికి ఇది వేదికగానూ నిలుస్తుంది. ఈ సీజన్‌లో స్ట్రీట్ రేస్‌ల కోసం నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని నాగ చైతన్య వ్యాఖ్యానించాడు.
వరల్డ్ పికిల్ బాల్ లీగ్
మరోవైపు సినీ నటి సమంత.. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో భాగమైంది. ఈ మేరకు చెన్నై ఫ్రాంచైజీని ఆమె కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ‘న్యూ బిగినింగ్’ అంటూ హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టెన్నిస్, టీటీ, బ్యాడ్మింటన్‌ను పోలి ఉండే పికిల్‌బాల్ గేమ్‌కు కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి. 1965లో అమెరికాలో మొదలైన ఈ ఆటకు ఇప్పుడిప్పుడే మన దగ్గర ఆదరణ లభిస్తోంది.