అప్పుడు గోబెల్స్.. ఇప్పుడు కిషన్​రెడ్డి: మల్లు రవి

అప్పుడు గోబెల్స్.. ఇప్పుడు కిషన్​రెడ్డి: మల్లు రవి
  • మోదీ చెప్పే అబద్ధాలను బీజేపీ రాష్ట్ర చీఫ్​ వల్లెవేస్తున్నారు: మల్లు రవి 

హైదరాబాద్, వెలుగు: హిట్లర్ కేబినెట్​లో గోబెల్స్​ఉన్నట్టే.. మోదీ కేబినెట్​లో  కిషన్ రెడ్డి ఉన్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి విమర్శించారు.  ఆగస్టు 15 లోపే 2 లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ మాటపై రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మకం ఉన్నదని, కానీ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాత్రం రుణ మాఫీ చేయరని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

శుక్రవారం మల్లు రవి గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. మోదీ చెప్పే అబద్ధాలను కిషన్ రెడ్డి వల్లె వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారంటీలు అమలవుతున్న విషయం బీజేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి  సోది చెప్పే స్థాయికి దిగజారారని విమర్శించారు. ‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి సన్మానం  చేస్తాం..సోనియా  రాకను అడ్డుకుంటే ప్రజలే తిరగబడ్తరు.. జాగ్రత్త 
కిషన్ రెడ్డి” అని మల్లు రవి హెచ్చరించారు.