మంత్రి కొండా సురేఖపై కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున

మంత్రి కొండా సురేఖపై కేసు  వెనక్కి తీసుకున్న నాగార్జున

బషీర్​బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన నాగార్జున.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. రూ.100 కోట్ల పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్ మీడియా లింక్స్ కోర్టులో సబ్మిట్ చేశారు. నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టులో ప్రస్తుతం విచారణ నడుస్తున్నది. ఈ క్రమంలోనే నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ ఎక్స్ వేదికగా పశ్చాతాపం వ్యక్తం చేశారు. 

“నాగార్జునకు సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు.  నాగార్జున కుటుంబ సభ్యులను బాధపెట్టాలని లేదా వారి పరువుకు భంగం కలిగించాలనే ఉద్దేశం నాకు లేదు. వారి కుటుంబ విషయంలో నేను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా అనుకోని పొరపాటు జరిగివుంటే చింతిస్తున్నాను. నాగార్జున ఫ్యామిలీపై నేను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా” అని కొండా సురేఖ సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్పారు. ఈ క్షమాపణతో నాగార్జున మనసు మార్చుకున్నారు. గురువారం నాంపల్లి కోర్టులో జరిగిన విచారణలో రెండు వైపులా న్యాయవాదులు హాజరయ్యారు. నాగార్జున తరఫు న్యాయవాది పిటిషన్ ఉపసంహరణకు అనుమతి కోరగా కోర్టు అంగీకరించింది.