- విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- నాగర్ కర్నూల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హెచ్చరిక
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మంగళవారం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 10:38 గంటలకు జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, సిబ్బంది గైర్హాజరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయని, ప్రతీ ఉద్యోగి ఉదయం 10:30 గంటలలోపు రావాలి అన్నారు.
అనంతరం తాడూరు మండలం గుంత కోడూరులో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. వేసవి దృష్ట్యా కూలీలకు పని ప్రదేశంలో తాగునీరు, నీడ లాంటి వసతులు కల్పించాలని, ఉదయం 6 గంటలకే పనులు ప్రారంభించి వేతనాలు సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. అలాగే చెంచుల పునరావస గ్రామాల అభివృద్ధిపై వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ హాలులో మీటింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ భూముల సర్వే, సరిహద్దుల గుర్తింపు, భూముల రికార్డుల నవీకరణ లాంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచి తరలించే నాలుగు చెంచు గ్రామాల వారికి పునరావాసం కల్పిస్తున్న పెద్ద కొత్తపల్లి మండలం బాచారంలో పాఠశాలలు, అంగన్‌వాడీలు, రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అడవుల సంరక్షణలో స్థానికులను భాగస్వాములను చేస్తూనే, అక్రమంగా చెట్లు నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
