- మున్సిపల్ ఆదాయానికిభారీగా గండి
- 20 షాపులకు సింగిల్ టెండర్
గద్వాల, వెలుగు: ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ఉన్న మున్సిపల్ షాపుల వేలంలో సిండికేట్ గా మారడంతో షాపుల వేలం ఏకపక్షంగా జరిగింది. దీంతో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి పడింది. మున్సిపాలిటీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో ఉన్న 38 షాపులకు మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో శనివారం టెండర్లు నిర్వహించారు. మొత్తం 117 దరఖాస్తులు రాగా, వివిధ కారణాలతో 56 దరఖాస్తులను తిరస్కరించారు. 38 షాపులకు కేవలం 61 మంది మాత్రమే వేలంపాటలో పాల్గొన్నారు. 20 షాపులకు సింగిల్ టెండర్లు వచ్చిన వారికే అప్పజెప్పారు.
మిగతా 18 షాపులకు రెండు, మూడు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బహిరంగ మార్కెట్ లో షాపుల కిరాయిలు వేల రూపాయల్లో ఉండగా, ఇక్కడ నామ మాత్రం కిరాయిలకు ఇవ్వడంపై పలు విమర్శలు వస్తున్నాయి. మున్సిపాలిటీ షాపుల టెండర్ లో అక్రమాలు జరిగాయని మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడిందని వాటిని రద్దుచేసి మళ్లీ రీటెండర్లు నిర్వహించాలని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ లీడర్లు కలెక్టరేట్ లో ఏవో భూపాల్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
