సమస్యల పరిష్కారంలో ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించాలి : కలెక్టర్ బి. చంద్రశేఖర్

 సమస్యల పరిష్కారంలో ఆఫీసర్లు బాధ్యతగా వ్యవహరించాలి : కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్గొండ, వెలుగు:  రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆఫీసర్లు చురుగ్గా వ్యవహరించాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.  నల్గొండ నూతన కలెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ఆయన శుక్రవారం తన చాంబర్‌‌‌‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.  ఫిర్యాదుల రిజిస్టర్లు, వివరాలు కచ్చితంగా నిర్వహించాలని చెప్పారు.  క్షేత్రస్థాయిలో అభివృద్ధి, సం క్షేమ పథకాల అమలులో రెవెన్యూ అధికారులు భాగస్వాములు కావాలని తెలిపారు.  భూ భారతి , పౌరసరఫరాలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ బి. చంద్రశేఖర్ ను కలిసి పూల మొక్కను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలి 

మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను పునః పరిశీలన చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌‌‌‌లో స్థానిక సంస్థల ఇన్‌‌ చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నెల1న మున్సిపల్ వార్డుల వారీగా ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్లు, బీఎల్‌‌ఓలు, వార్డు ఆఫీసర్లు పునఃపరిశీలన చేయాలని  చెప్పారు.  మున్సిపాలిటీలలో ప్రచురించిన ఓటరు జాబితా పై ఈ నెల 5 వరకు అభ్యంతరాలను స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించి మున్సిపాలిటీల్లో  హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.