- అధికారులకు నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశం
నల్గొండ, వెలుగు: జిల్లాలో రానున్న జులై 15 వరకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు తాగునీటి విషయంలో పూర్తి భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
క్షేత్రస్థాయిలో బల్క్ సరఫరాలో రిపేర్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకునేలా చూడాలని సూచించారు. తాగునీటి నాణ్యతను పరీక్షించిన తర్వాతే సరఫరా చేయాలని, ఇందుకోసం మున్సిపాలిటీలకు అందించిన టెస్టింగ్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఏఈలు నిరంతరం గ్రామ సర్పంచులతో సమన్వయం చేసుకుంటూ, సమస్యలు వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
