నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో వాణిజ్య ఎల్‌పీజీపై ఆధారపడటాన్ని తగ్గించి, పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్ జీ) సరఫరాను స్పీడప్ చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో గ్యాస్ పంపిణీ విస్తరణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇంధన సంక్షోభం దృష్ట్యా మెగా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన పైప్‌లైన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు 24 గంటల పాటు పని చేసేందుకు అనుమతినిచ్చామని వెల్లడించారు. తాగునీటి సరఫరా తరహాలోనే ఇంటింటికి గ్యాస్ అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని, వలిగొండ నుంచి నార్కట్‌పల్లి వరకు పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు పీఎన్‌జీ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో
పనిచేయాలన్నారు.
