- తల్లీకూతుళ్ల మర్డర్‌కు కుటుంబ, ఆస్తి తగాదాలే కారణం
- ఐదుగురు అరెస్ట్, పరారీలో ముగ్గురు
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామంలో ఈ నెల 17న జరిగిన తల్లి, కూతురు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. మంగళవారం మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. ఇబ్రహీంపేట గ్రామానికి చెందిన రుద్రాక్షి సుమలత(45), ఆమె కూతురు రుద్రాక్షి లావణ్య(23) ను భూ వివాదాలు, ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలతో ప్లాన్ ప్రకారం హత్య చేశారు.
లావణ్య పేరిట ఉన్న 5.24 ఎకరాల భూమిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రుద్రాక్షి సుమలత, ఆమె కుమార్తె లావణ్య గ్రామ శివారులోని తమ ఆయిల్‌పామ్ తోటకు వెళ్లగా నిందితులు వారిని వెంబడించి కారంపొడి చల్లి, చున్నీలతో గొంతు బిగించి హత్య చేశారు.
బైక్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని, నల్గొండ జిల్లా త్రిపురారం మండలం నీలాయిగూడెం గ్రామానికి చెందిన గుర్రం నవనీత, గుర్రం రమేశ్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి విలేజ్ కి చెందిన అంగడి రేణుక, ఇదే మండలం రెడ్డి బావికి చెందిన గుండ్లపల్లి స్వామి, ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్ష మహేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఈ కేసులో ఇబ్రహీంపేటకు చెందిన నిమ్మల శశికళ, నిమ్మల వెంకన్న, నిడమనూరుకు చెందిన రుద్రాక్షి నరసింహ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
