హాలియా, వెలుగు: పెట్టుబడులపై అధిక వడ్డీ ఇస్తామని, తక్కువ కాలంలోనే డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మబలికి అమాయక ప్రజల నుంచి సుమారు రూ. 40 కోట్ల వరకు వసూలు చేసిన కేసులో నల్గొండ జిల్లా పోలీసులు మంగళవారం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సీఐ బి. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం హాజ్య తండాకు చెందిన వడత్య భీమా అనే వ్యక్తి ప్రధాన సూత్రధారిగా, నేనావత్ రమేశ్, ఆంగోతు సురేశ్, రాత్లవత్ గణేశ్అనే మరో ముగ్గురు ఏజెంట్లతో కలిసి హైదరాబాద్ కేంద్రంగా ‘ఎస్బీవీ గ్రీన్ ఇన్‌ఫ్రా’, ‘బీ కాయిన్ వరల్డ్ డెవలపర్స్’ అనే నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థలను సృష్టించి ఈ మోసానికి పాల్పడ్డారు.
పెద్దవూర, చందంపేట, మల్లేపల్లి లాంటి ప్రాంతాల్లో విస్తరించి సుమారు రూ.40 కోట్ల వరకు వసూళ్లకు పాల్పడిన వీరు, బాధితులకు వడ్డీ చెల్లించడం నిలిపివేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారికి రూ.194 కోట్లు ఇచ్చి మోసపోయిన బాధితుడు కోటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 4 మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్, భూములకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
