సాగర్ నీళ్ల ఇష్యూ.. ఇప్పటికే 680 టీఎంసీలు వాడేసిన ఏపీ.. ఇక మిగిలింది 28 టీఎంసీలే

సాగర్ నీళ్ల ఇష్యూ.. ఇప్పటికే 680 టీఎంసీలు వాడేసిన ఏపీ.. ఇక మిగిలింది 28 టీఎంసీలే

నాగార్జున సాగర్​ నీటిపై ఏపీ కన్నేసింది. ఇప్పటికే కోటాకు మించి నీటిని తన్నుకుపోయిన పొరుగు రాష్ట్రం.. తాజాగా మరిన్ని నీళ్లకు ఎసరు పెట్టింది. మన కోటా పూర్తి కాకుండానే.. మన వాటాలోంచి ఎత్తుకుపోయేందుకు కుట్ర చేస్తున్నది. తాగునీటి అవసరాలకు10 టీఎంసీలు కావాలంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అది కూడా సాగర్​ నుంచే ఇవ్వాలని కోరింది.

ఇప్పటికే 680 టీఎంసీలు వాడేసుకున్న ఏపీ..

సాగర్​, శ్రీశైలంలో కలిపి ఇప్పటికే ఏపీ 680 టీఎంసీల జలాలను వాడుకున్నది. అదే సమయంలో తెలంగాణ 200 టీఎంసీలే వాడింది. పోతిరెడ్డిపాడు ద్వారా 200 టీఎంసీలను ఏపీ తీసుకెళ్లింది. హంద్రీనీవా ద్వారా 48 టీఎంసీలను ఏపీ వాడుకున్నది. ఇటు సాగర్​ కుడి కాల్వ ద్వారా 145 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 28 టీఎంసీలు, ప్రకాశం బ్యారేజీ నుంచి 165 టీఎంసీలు, తుంగభద్ర నుంచి 84 టీఎంసీలు, చెన్నై వాటర్​ సప్లై ద్వారా 3 టీఎంసీల జలాలను ఏపీ తరలించుకుపోయింది. తీరా ఇప్పుడు మరిన్ని నీళ్లు కావాలంటూ ఏపీ పట్టుబడుతున్నది. అంతేకాదు.. అసలు వరద రోజుల్లో తరలించుకుపోయిన 215 టీఎంసీలను లెక్కల్లో కలప వద్దంటూ వితండవాదం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సాగర్​లో ఉన్నది 28 టీఎంసీలే..

కృష్ణాలో ప్రస్తుతం డెడ్​స్టోరేజీకి ఎగువన కేవలం 33 టీఎంసీల జలాలే ఉన్నాయి. అందులో శ్రీశైలంలో 5.27 టీఎంసీలు, నాగార్జునసాగర్​లో 28.21 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి శ్రీశైలంలో 818.30 అడుగుల ఎత్తులో 39.61 టీఎంసీల జలాలున్నా, డెడ్​స్టోరేజ్​ 810 అడుగుల ఎత్తులో ఉన్నది 5.27 టీఎంసీలే. అలాగే సాగర్​లో 525.70 అడుగుల మట్టంతో 159.88 టీఎంసీల నీళ్లున్నప్పటికీ డెడ్​స్టోరేజ్​ లెవెల్​ 510 అడుగుల వద్ద ఉన్నది 28.21 టీఎంసీలు మాత్రమే. ఇప్పుడు ఈ సాగర్​ జలాల నుంచే 10 టీఎంసీలు కావాలని ఏపీ అడుగుతున్నది. వాస్తవానికి వచ్చే ఏడాది సూపర్​ఎల్​నినో ప్రభావంతో కరువు తీవ్రంగా ఉండవచ్చని, సాగునీటి సంగతేమోగానీ, తాగునీటికీ కటకట తప్పదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలాంటి తరుణంలో నీళ్లను ఆచితూచి వాడుకోవాల్సిందిపోయి.. ఎప్పట్లాగే విచ్చలవిడిగా వాడుకునేందుకు ఏపీ ఇండెంట్​పెట్టిందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఏపీ అడిగిందే తడువుగా కృష్ణా బోర్డు కూడా ఏపీ లేఖపై అభిప్రాయం తెలపాలంటూ తెలంగాణకు లెటర్​ రాసింది. అభిప్రాయాలను ఈ నెల ఐదో తేదీ నాటికి తెలపాలని, అందుకు అనుగుణంగా త్వరలో నిర్వహించబోయే 21వ బోర్డు మీటింగ్​లో చర్చిస్తామని పేర్కొంది. 

►ALSO READ | జయంతి ఉత్సవాలకు రండి..మంత్రి సురేఖకు కొండగట్టు ఈవో ఆహ్వానం