జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. మే 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను కొండగట్టు ఆలయ ఈవో అంజన రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా కోరుతూ మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు.
ALSO READ : శ్రీశైలంలోనూ శ్రీ గిరి ప్రదక్షణ
అనంతరం తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేందర్ శర్మను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఉత్సవాలకు విచ్చేసి అంజన్న ఆశీస్సులు తీసుకోవాలని వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ సునీల్, స్థానాచార్యుడు కపిందర్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ యంత్రాంగం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
