వెనక్కి తగ్గిన నల్లగొండ టీఆర్ఎస్ కౌన్సిలర్లు

వెనక్కి తగ్గిన నల్లగొండ టీఆర్ఎస్ కౌన్సిలర్లు

తిరుగుబాటు జెండా ఎగురవేసిన నల్లగొండ టీఆర్ఎస్ కౌన్సిలర్లు.. చివరకు వెనక్కి తగ్గారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని జరగకుండా అడ్డుకోవాలని కౌన్సిలర్లు భావించినా.. సాధ్యం కాలేదు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్ దిగొచ్చి బుజ్జగిస్తారని వేసిన ప్లాన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లతో  కలిసి మెజార్టీ సభ్యులతో కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తమ పంతం నెగ్గించుకున్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి నిధులు కేటాయించడం లేదని ఆరోపిస్తూ.. టీఆర్ఎస్ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో మళ్లీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్ తో కలిసి పని చేస్తామంటూ కౌన్సిలర్లు దారికొచ్చారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్ ను కలిసి తప్పైందని ఒప్పుకున్నారు తిరుగుబాటు కౌన్సిలర్లు. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. పొరపాటు చేశాం.. పార్టీ పెద్దలు క్షమించాలని వేడుకున్నారు. వార్డులు అభివృద్ధి జరగడం లేదనే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలిపారు. తమ నిర్ణయంతో పార్టీపై తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేసినందుకు మన్నించాలన్నారు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేయడం సరి కాదన్నారు. 

నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులే అధికార పార్టీలో అసమ్మతికి కారణం అయ్యాయని తెలుస్తోంది. డెవలప్ మెంట్ పనులు పర్యవేక్షించేందుకు కొత్త మున్సిపల్ కమిషనర్ ను సీఎం కేసీఆర్ నియమించారు. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో పాటు, కమిషనర్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. అప్పటి నుంచి మున్సిపాలిటీలో పనులు వేగంగా జరుగుతున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులకు సంబంధం లేకుండానే పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చైర్మెన్ మందడి సైదిరెడ్డి కావాలనే తమకు పక్కన పెడుతున్నారని కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. మళ్లీ రాజీకొచ్చారు. కుటుంబంలో తప్పులు దొర్లడం సహజమేనని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డితలు పేర్కొన్నారు. వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు. 
తిరుగుబాటు చేసిన కౌన్సిలర్లు ఎలాంటి హామీ లేకుండానే రాజీకొచ్చినట్లు తెలుస్తోంది.