హైదరాబాద్, వెలుగు : టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి కోర్టు అనుమతి లభించింది. నిందితులను చంచల్‌గూడ జైల్లో సోమ, మంగళవారాల్లో ప్రశ్నించేందుకు అనుమతి ఇస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. వారిద్దరినీ ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 6న ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
పేపర్ లీకేజీ నిందితులను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద విచారించేందుకు అనుమతి ఇవ్వాలని గోయల్ కోరారు. ఆయన పిటిషన్‌పై శనివారం విచారణ జరిపిన కోర్టు.. నిందితులను విచారించవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితులను ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌తో పాటు మరో నలుగురు అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా ప్రవీణ్, రాజశేఖర్‌ను విచారించనున్నారు. కోర్టు అనుమతితో ల్యాప్‌టాప్, ప్రింటర్ సహా ఇన్వెస్టిగేషన్‌కు అవసరమైన డిజిటల్ పరికరాలను జైలుకు తీసుకెళ్లనున్నారు.
ఈ కేసులో ఇప్పటికే టీఎస్ పీఎస్‌సీ అడ్మిన్ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ,సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. వారిద్దరు ఇచ్చిన సమాచారం, ఇప్పటికే తాము సేకరించిన సమాచారంతో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి నుంచి ఈడీ అధికారులు వివరాలు సేకరించనున్నారు. ప్రధానంగా సిట్ అధికారులు సీజ్ చేసిన నగదు, నిందితుల బ్యాంకు ట్రాన్సాక్షన్ల ఆధారంగా విచారించనున్నారు.
