శనివారం ( జనవరి 24 ) నాంపల్లిలోని బచ్చ క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాలుగు అంతస్తుల బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ పై అంతస్తులకు వ్యాపించాయి. ఘటనపై సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నప్పటికీ మంటలు ఇంకా ఆపులోకి రాలేదు. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు అధికారులు చుట్టుపక్కల షాపులు మూసివేయించారు.
గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగు ఫ్లోర్ల వరకు దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ క్రమంలో లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో స్కై లిఫ్టర్ ద్వారా బిల్డింగ్ అద్దాలు పగలకొట్టెందుకు కసరత్తు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది.ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతోంది. వాచ్ మెన్ యాదయ్య ఇద్దరు పిల్లలు ఇంకా సెల్లార్ లోనే చిక్కుకున్నట్లు సమాచారం.
అగ్ని ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంటలు భారీగా ఎగిసిపడుతూ దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
