ఫాం హౌస్ కేసు: 26, 27 తేదీల్లో నందకుమార్ను ప్రశ్నించనున్న ఈడీ

ఫాం హౌస్ కేసు:  26, 27 తేదీల్లో నందకుమార్ను ప్రశ్నించనున్న ఈడీ

మొయినాబాద్ ఫాం హౌస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను రెండు రోజుల పాటు ఈడీ విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతించింది. అతడిని డిసెంబరు 26,27 తేదీల్లో చంచల్ గూడ జైల్లో ఈడీ అధికారులు విచారించనున్నారు. కేసుకు సంబంధించి నంద కుమార్ ను ప్రశ్నించి స్టేట్మెంట్ ను నమోదు చేయనున్నారు. ఈ కేసులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ ను అధికారులు ప్రశ్నించనున్నారు.  

ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమీత్ గోయల్ తో పాటు మరో ఇద్దరికి మాత్రమే నందకుమార్ ను విచారించేందుకు  కోర్టు అనుమతి ఇచ్చింది. జైలు లోపలికి ప్రవేశించే ముందు.. ఈడీ అధికారులు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ లు జైలు అధికారులకు చూపించాలని నిర్దేశించింది. 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు నందకుమార్ ను చంచల్ గూడ జైల్లో విచారణ చేస్తారు.అయితే నందకుమార్ న్యాయవాదుల సమక్షంలోనే ఈ విచారణ జరుగుతుంది. నంద కుమార్ విచారణ ముగిశాక.. సమగ్రమైన రిపోర్ట్ తో పాటు కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను  కోర్టు కు సమర్పించాలని ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ కు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఇప్పటికే రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించిన ఈడీ.. ఆయన బ్యాంకు లావాదేవీలతో పాటు  కుటుంబసభ్యుల బ్యాంకు అకౌంట్లను పరిశీలించింది. ఈనెల 27న మరోసారి విచారణకు హాజరుకావాలని రోహిత్ రెడ్డికి నిర్దేశించింది. కాగా, మొయినాబాద్ ఫాం హౌస్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా.. ఈడీ అధికారులు ECIR నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈడీ విచారణను జరుపుతోంది.