అత్యధికంగా సికింద్రాబాద్ ఎంపీకి 45 మంది పోటీ

అత్యధికంగా సికింద్రాబాద్ ఎంపీకి  45 మంది పోటీ

రాష్ట్రంలో 17 లోక్ సభ నియోజకవర్గాల బరిలో మొత్తం 525 మంది పోటీలో నిలిచారు.   మొత్తం 17 సెగ్మెంట్లలో 625 నామినేషన్లు దాఖలు కాగా.. 100 మంది విత్ డ్రా చేసుకున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ బరిలో 45 మంది నిలవగా.. ఆదిలాబాద్ లో అత్యల్పంగా 12 మంది పోటీలో నిలిచారు.

పెద్దపల్లి లోక్ సభలో 49 నామినేషన్లు రాగా.. ఏడుగురు విత్ డ్రా చేసుకున్నారు. పోటీలో 42 మంది నిలిచారు. కరీంనగర్ లో ఐదుగురు విత్ డ్రా చేసుకోగా.. బరిలో 28 మంది నిలిచారు. నిజామాబాద్ లో 3 నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. 29 మంది పోటీలో ఉన్నారు. జహీరాబాద్ లో ఏడు నామినేషన్లు విత్ డ్రా కాగా.. 19 మంది బరిలో నిలిచారు. 

మెదక్ లో 53 నామినేషన్లు దాఖలు కాగా.. తొమ్మిది మంది విత్ డ్రా చేసుకున్నారు. 44 మంది ఫైనల్ ఫైట్ కు సిద్ధంగా ఉన్నారు. మల్కాజ్ గిరిలో 22 మంది.. హైదరాబాద్ లో 30 మంది, చేవెళ్లలో 43 మంది, మహబూబ్ నగర్ లో  31 మంది పోటీలో ఉండగా.. నాగర్ కర్నూలులో 19 మంది, నల్లగొండలో 22 మంది బరిలో నిలిచారు. 

భువనగిరిలో 51 నామినేషన్లు దాఖలు కాగా.. 12 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో 39 మంది బరిలో నిలిచినట్లు ఈసీ ప్రకటించింది. వరంగల్ లో ఆరుగురు నామినేషన్లు ఉపసంహరించుకోగా.. 42 మంది పోటీలో నిలిచారు. మహబూబాబాద్ లో 23, ఖమ్మంలో 35 మంది పోటీలో ఉన్నట్లు సీఈవో ప్రకటించారు. 

 నామినేషన్ల కీలకఘట్టం ముగియడంతో అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్ చేశారు. మరో రెండు వారాలే ప్రచారానికి సమయం ఉండటంతో ప్రజల దగ్గరకు వెళ్తున్నారు. వచ్చేనెల 11న సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెర పడనుంది. మే 13న 17 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు వెలువడనున్నాయి.