మీ భార్యలు, పిల్లల్ని బాగా తిట్టండి.. కొట్టండి.. అస్సలు తప్పులేదు.. మీ భార్యలను హింసించటం అస్సలు తప్పులేదు.. కాకపోతే ఒక కండీషన్.. మీ భార్యల ఎముకలు విరిగేంతగా మాత్రం కొట్టొద్దు.. ఏంటీ భార్యలను చావకొట్టచ్చా.. ఇలాంటి చట్టం కూడా ఉందా భూమిపై అనుకోవద్దు.. అక్షరాల ఇలాంటి చట్టం ఉంది.. ఎక్కడో కాదు.. ఇండియాకు సమీపంలోనే.. ఇండియాకు దగ్గర దేశమే.. అదే ఆఫ్గనిస్తాన్ దేశం.. ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వం.. అదేనండీ తాలిబన్లు కొత్త చట్టం తీసుకొచ్చారు. భార్య, పిల్లల్ని కొట్టటం తప్పులేదని 90 పేజీల కొత్త క్రిమినల్ కోడ్ తీసుకొచ్చారు. దీనిపై తాలిబన్ సుప్రీం హిబతుల్లా అఖుంద్దాదా సంతకం కూడా చేశారు.. ఈ చట్టంలోని అద్భుతమైన నిబంధనలు ఏంటో పూర్తిగా తెలుసుకుందామా..
అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలనలో మహిళల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇప్పటికే చదువు, ఉద్యోగం, కనీసం బయట తిరిగే స్వేచ్ఛను హరించిన తాలిబన్లు.. ఇప్పుడు ఏకంగా గృహహింసను చట్టబద్ధం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆమోదించిన ఈ 90 పేజీల కొత్త క్రిమినల్ కోడ్.. మహిళల పట్ల భర్తలకు ఉన్న అధికారాన్ని సమర్థిస్తోంది. భార్యాబిడ్డలను కొట్టండి తప్పులేదు.. కానీ ఎముకలు విరక్కూడదు, లోతైన గాయాలు కాకూడదు అనే రూల్స్ ఇప్పుడు అఫ్గాన్ మహిళలను వణికిస్తోంది.
నేరం రుజువైనా భర్తకు శిక్ష తక్కువే..
కొత్త చట్టం ప్రకారం.. భర్త తన భార్యపై శారీరక శిక్షను ప్రయోగించవచ్చు. ఒకవేళ ఆ హింసలో ఎముకలు విరిగినా లేదా తీవ్రమైన గాయాలైనా.. భార్య ఆ విషయాన్ని కోర్టులో నిరూపిస్తే తప్ప భర్తకు శిక్ష పడదన్నమాట. ఒకవేళ నేరం రుజువైనా.. భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే పడుతుందట. అది కూడా భార్య కోర్టుకు వచ్చి తన గాయాలను న్యాయమూర్తికి చూపించాకే జరుగుతుంది. ఇక్కడే అసలైన చిక్కు ఉంది.. ఆమె కోర్టుకు వెళ్లాలన్నా తప్పనిసరిగా ఒక మగ వ్యక్తి గార్డియన్‌గా రావాల్సి ఉంటుంది ఆమెకు తోడుగా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. తనను కొట్టిన అదే భర్తను తోడుగా తీసుకుని కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండటం.
భర్తకు చెప్పకుండా వెళితే జైలుకే..
అంతేకాదు మహిళల కదలికలపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. భర్త అనుమతి లేకుండా భార్య పుట్టింటికి వెళ్లినా లేదా బంధువుల ఇళ్లకు వెళ్లినా ఆమెకు మూడు నెలల జైలు శిక్ష తప్పదని తాలిబన్ చట్టాలు చెబుతున్నాయి. గతంలో మహిళల రక్షణ కోసం ఉన్న 2009 నాటి చట్టాలను తాలిబన్లు పూర్తిగా రద్దు చేశారు.
సామాన్యులకు కొరఢా దెబ్బలు..
ఈ కొత్త కోడ్‌లో మరో విచిత్రమైన అంశం ఏంటంటే.. శిక్షలను సామాజిక హోదాను బట్టి విభజించారు. అంటే మత పెద్దలు లేదా ఉన్నత వర్గాలకు చెందిన వారు తప్పు చేస్తే కేవలం సలహా ఇచ్చి వదిలేస్తారంట. కానీ సామాన్య, దిగువ తరగతి ప్రజలు తప్పు చేస్తే మాత్రం జైలు శిక్షతో పాటు కొరడా దెబ్బలు తప్పవు. జంతువుల మధ్య పందాలకు వేసే శిక్ష కంటే.. మహిళలపై హింసకు పడే శిక్ష తక్కువగా ఉండటం ఈ చట్టంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది. ఐక్యరాజ్యసమితి దీనిని జెండర్ అపార్థైడ్గా అభివర్ణిస్తుంటే.. అక్కడి మహిళలు మాత్రం కళ్లముందే తమ జీవితాలు అంధకారంలోకి వెళ్తున్నాయని మౌనంగా ఉండిపోతున్నారు.
