భారత్‌లో ఓపెన్ ఏఐ భారీ విస్తరణ.. బెంగళూరు, ముంబైలలో కొత్త ఆఫీసులు

భారత్‌లో ఓపెన్ ఏఐ భారీ విస్తరణ.. బెంగళూరు, ముంబైలలో కొత్త ఆఫీసులు

ఏఐ ప్రపంచంలో అగ్రగామి సంస్థగా ఉన్న 'OpenAI' భారతదేశంపై తన దృష్టిని కేంద్రీకరించింది. ఢిల్లీలో జరుగుతున్న సమ్మిట్ వేదికగా ఆ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ కీలక ప్రకటనలు చేశారు. ఇప్పటికే న్యూఢిల్లీలో ఆఫీసు ఉన్న ఓపెన్ ఏఐ.. త్వరలోనే దేశంలోని టెక్ హబ్స్ అయిన బెంగళూరు, ముంబైలలో కూడా కొత్త కార్యాలయాలను ప్రారంభించనుంది. "భారతదేశం కోసం ఏఐ.. భారతదేశంతో కలిసి ఏఐ" అనే నినాదంతో ఓపెన్ ఏఐ తన కార్యకలాపాలను మనదేశంలో ప్రస్తుతం విస్తరిస్తోంది.

ఒక్కసారిగా మాయమైన బ్లాగ్ పోస్ట్:
అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ ఏఐ అధికారికంగా విడుదల చేసిన "ఇంట్రడ్యూసింగ్ ఓపెన్ ఏఐ ఫర్ ఇండియా" అనే బ్లాగ్ పోస్ట్ వెబ్‌సైట్ నుంచి అకస్మాత్తుగా మాయమైంది. ఆ లింక్ క్లిక్ చేస్తే 404 ఎర్రర్ అని చూపిస్తుండటంతో టెక్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇది సాంకేతిక లోపమా లేక సమయం కంటే ముందే సమాచారం లీక్ అయిందని వెనక్కి తీసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఇండియాలో ఆఫీసుల ఏర్పాటుపై క్లారిటీ వచ్చేసింది.

టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం:
దేశంలో 'సావరిన్ ఏఐ' మౌలిక సదుపాయాలను సిద్ధం చేసేందుకు ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్‌తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. TCSకి చెందిన 'హైపర్ వాల్ట్' డేటా సెంటర్ల ద్వారా 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్లను ఓపెన్ ఏఐ వినియోగించనుంది. దీనివల్ల డేటా భద్రత పెరగడమే కాకుండా.. మన దేశం లోపలే ఏఐ మోడల్స్ వేగంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా లక్షలాది మంది టీసీఎస్ ఉద్యోగులకు చాట్ జీపీటీ ఎంటర్‌ప్రైజ్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

ALSO READ : AI సమ్మిట్‌లో అతిథులకు ఇన్ని కష్టాలా..? ట్వీట్స్ చూడండి ఏడుపొక్కటే తక్కువ వాళ్లకి..

విద్యార్థులకు ఏఐ ట్రైనింగ్..
టెక్నాలజీతో పాటు నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా ఓపెన్ ఏఐ ఒక విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్ న్యూఢిల్లీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఏడాదిలో లక్ష మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులకు ఏఐ నైపుణ్యాలను నేర్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. విద్యార్థులకు 'ChatGPT Edu' లైసెన్సులను అందించి వారిని ఏఐ ఎకానమీకి సిద్ధం చేయనున్నారు.