AI సమ్మిట్‌లో అతిథులకు ఇన్ని కష్టాలా..? ట్వీట్స్ చూడండి ఏడుపొక్కటే తక్కువ వాళ్లకి..

AI సమ్మిట్‌లో అతిథులకు ఇన్ని కష్టాలా..? ట్వీట్స్ చూడండి ఏడుపొక్కటే తక్కువ వాళ్లకి..

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 టెక్నాలజీ ప్రపంచంలో సరికొత్త విప్లవం అనుకుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం అది సామాన్యులకు, ఈవెంట్ కి వచ్చిన అతిథులకు ఒక పీడకలగా మారింది. గ్లోబల్ ఏఐ పుష్ అంటూ ప్రచారాల్లో హోరెత్తించిన మోడీ సర్కార్.. నిర్వహణలో మాత్రం పూర్తిగా అట్టర్ ప్లాప్ అయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎక్స్ వేదికగా ఈ సదస్సుకు హాజరైన ప్రతినిధులు, విదేశీయులు తమ చేదు అనుభవాలను పంచుకుంటూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. అలాగే ఎంట్రీ వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ గేట్స్ కూడా సరిగా పనిచేయకపోవటం కూడా ఆలస్యాలకు కారణం అయ్యిందని చాలా మంది కంప్లెయింట్ చేశారు.

టెక్ సదస్సులో ల్యాప్‌టాప్‌లపై నిషేధం:

డిజిటల్ విప్లవం గురించి మాట్లాడే చోట అతిథులకు ఎదురైన మొదటి షాక్ కొన్ని వస్తువులపై నిషేధం. ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఇయర్‌బడ్స్, చివరికి కార్ కీస్‌ను కూడా లోపలికి అనుమతించకపోవడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టెక్ ఈవెంట్‌కు ల్యాప్‌టాప్ అవసరం లేదనుకున్నారా? వినడం ఆప్షనల్ కాబట్టి ఇయర్‌బడ్స్ వద్దన్నారా? అంటూ నిషేధిత వస్తువుల లిస్టును ఎగతాళి చేస్తున్నారు. దీనికి తోడు ప్యానల్ చర్చల్లో కఠినమైన ప్రశ్నలు అడగకూడదనే అలిఖిత నిబంధనలు కూడా అమలు చేయడం ఈ సదస్సును ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విజిటర్స్ గోస..

ప్రధాని మోడీ పర్యటన పేరుతో భారత్ మండపం మొత్తం ఒక సెక్యూరిటీ ఫోర్ట్రెస్‌గా మారిపోయింది. సొంత డబ్బులు చెల్లించి స్టాల్స్ పెట్టుకున్న ఎగ్జిబిటర్లను కూడా బయటకు పంపేయడం, ఫౌండర్ల ప్రొడక్ట్స్ మాయమవ్వడం వంటి ఘటనలు సవన్వయ లోపాలను బయటపెట్టింది. సమ్మిట్ ప్రాంగణంలో సరిగ్గా ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో డెమోలు ఫెయిల్ అయ్యాయని ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్లు, లోపలికి వెళ్లాక కనీసం డిజిటల్ చెల్లింపులు లేకపోవడంతో విదేశీ ప్రతినిధులు భారత్ సాధించిన డిజిటల్ ప్రగతిని చూసి నవ్వుకుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రోడ్లపై నరకం.. ఫారెన్ గెస్ట్స్ ఆవేదన

సదస్సు ముగిసిన తర్వాత రాత్రి వేళ బయటకు వచ్చిన అతిథులకు అసలైన కష్టాలు మొదలయ్యాయి. వీఐపీల కోసం దాదాపు 5 కిలోమీటర్ల మేర రోడ్లను బ్లాక్ చేశారు. దీంతో సమ్మిట్ ప్రాంతానికి క్యాబ్‌లు లేవు, షటిల్ సర్వీసులు లేవు. అలసిపోయిన ఇంజనీర్లు, విదేశీయులు, దివ్యాంగులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వచ్చింది. ఒక విదేశీయుడు రికార్డ్ చేసిన వీడియోలో.. రాజకీయ నాయకుల ఆనందం కోసం సామాన్యులను ఇంతలా హింసిస్తారా? ఏ దేశం కూడా తన టెక్ టాలెంట్‌ను ఇంత దారుణంగా గౌరవించదు అని ఆవేదన వ్యక్తం చేయడం భారత్ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసింది.

అశ్విని వైష్ణవ్ టార్గెట్‌గా విమర్శలు..

ఈ మొత్తం గందరగోళానికి ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవే బాధ్యత వహించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. "రీల్ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు.. ఈ అట్టర్ ప్లాప్ షోకి ఇప్పుడు ఎవరిని నిందిస్తారు? నెహ్రూనా లేక రాహుల్ గాంధీనా?" అంటూ ఘాటు పోస్ట్ పెట్టారు ఒక నెటిజన్. భారతదేశపు గ్లోబల్ ఏఐ పుష్‌ను ఈ నిర్వహణ లోపాలు అగాధంలోకి నెట్టేశాయని, భవిష్యత్తులో ఇలాంటి సదస్సులకు రావాలంటేనే టెక్ నిపుణులు భయపడేలా చేశారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.