బెంగళూర్ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడటం కలకలం రేపింది. గ్రాముల్లో సరఫరా చేసే స్మగ్లర్లు ఏకంగా కేజీల్లో డ్రగ్స్ తో పట్టుబడటం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులను షాక్ కు గురిచేసింది. గురువారం (ఫిబ్రవరి 19) కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో 4 కిలోల 776 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు అధికారులు.
పట్టుబడిన కొకైన్ విలువ 23 కోట్ల 88 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఖతార్ లోని దోహా నుంచి వస్తున్న ప్రయాణికుడు డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారంతో.. NCB అధికారులు సోదాలు నిర్వహించారు. రోజూవారి రాకపోకల పరిశీలనలో భాగంగా చెక్ చేసినట్లుగానే అనుమానం రాకుండా అనుమానితుడిని చెక్ చేశారు. ఆ తర్వాత ట్రాన్సిట్ చెక్స్ లో భాగంగా అతని దగ్గర భారీ ఎత్తున ఉన్న కొకైన్ ను పట్టుకున్నారు. నిందితుడు బ్రెజిల్ దేశస్తుడుగా పోలీసులు గుర్తించారు.
కీలక సమాచారం ఆధారంగా ప్యాసెంజర్స్ బ్యాగేజ్ చెక్ చేస్తున్న అధికారులకు కొకైన్ తో కూడిన బ్యాగ్ పట్టుబడినట్లు NCB అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిక వెనుక ఉన్న ముఠాను గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
