KKR vs DC: శివాలెత్తిన ఫిల్ సాల్ట్.. కోల్‌క‌తా చేతిలో ఢిల్లీ ఓటమి

KKR vs DC: శివాలెత్తిన ఫిల్ సాల్ట్.. కోల్‌క‌తా చేతిలో ఢిల్లీ ఓటమి

పటిష్ట గుజరాత్, ముంబై జట్లను ఓడించి జోరు మీద కనిపించిన ఢిల్లీ క్యాపిట‌ల్స్.. కోల్‌క‌తాపై ఆ దూకుడు కనపరచలేకపోయింది. ఘోరంగా పరాజయం పాలై నెట్ రన్‌రేట్‌ను దెబ్బ తీసుకుంది. సోమవారం(ఏప్రిల్ 29) ఈడెన్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కోల్‌క‌తా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఢిల్లీ 153 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని కోల్‌క‌తా ఓపెనర్ ఫిల్ సాల్ట్(68; 33 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఉఫ్ మని ఊదేశాడు. క్యాపిట‌ల్స్ బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. అతని ధాటికి కోల్‌క‌తా మరో 21 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేధించింది. 

సాల్ట్ బాదుడే బాదుడు

స్వల్ప ఛేదనలో సాల్ట్ వీర్ విహారం చేశాడు. ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బౌండరీల మోత మోగించాడు. ఏ ఒక్క బౌలర్‌ని ఉపేక్షించలేదు. రెండో ఓవర్ లో అతనిచ్చిన సునాయాస క్యాచ్‌ను విలియమ్స్ నేలపాలు చేశాడు. అక్కడినుంచి మ్యాచ్ హైలైట్స్ తరహాలో సాగింది. తొలి 6 ఓవర్లలో ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 79 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో ఉన్న సునీల్ నరైన్(10 బంతుల్లో 15) సైతం అతని విధ్వంసం ముందు ప్రేక్షక పాత్ర వహించాడు. ఆపై 21 పరుగుల స్వల్ప వ్యవధిలో నరైన్, సాల్ట్, రింకు సింగ్(11) వెనుదిరిగినా.. వారికి అదేం భారం కాలేదు.

10 ఓవర్లకే 100 పరుగులు చేరుకోవడం.. కావాల్సిన పరుగులు తక్కువ కావడంతో తరువాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్(33 నాటౌట్), వెంకటేష్ అయ్యర్(26 నాటౌట్) ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 57 పరుగులు జోడించారు.

ఆదుకున్న కుల్దీప్

అంతకుముందు సొంతగడ్డపై కోల్‌క‌తా బౌలర్లు విజృంభించడంతో ఢిల్లీ 153 పరుగులకే పరిమితమైంది. 35 పరుగులు చేసిన కుల్దీప్‌ యాదవ్ ఆ జట్టులో టాప్ స్కోరర్. పృథ్వీ షా(13), జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్(12), అభిషేక్ పోరెల్(18), షాయ్ హోప్(6), రిషబ్ పంత్(27), ట్రిస్టన్ స్టబ్స్(4), అక్సర్ పటేల్(15).. ఇలా టాఫార్డర్ మొదలు లోయర్ ఆర్డర్ బ్యాటర్ల వరకూ అందరూ విఫలమయ్యారు. పోటీ పడి మరీ పెవిలియన్ చేరారు. కోల్‌క‌తా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా, హర్షిత్ రానా, వైభవ్ అరోరా రెండేసి వికెట్లు తీసుకున్నారు.