దివ్యాంగుల జీవితాల్లో నారాయణ కాంతి.. 745 మందికి కృత్రిమ అవయవాల పంపిణీ

దివ్యాంగుల జీవితాల్లో నారాయణ కాంతి.. 745 మందికి కృత్రిమ అవయవాల పంపిణీ

అబిడ్స్, వెలుగు: నారాయణ సేవా సంస్థాన్ చేస్తున్న సేవలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కొనియాడారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‎లో ఆదివారం నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత మాడ్యులర్ కృత్రిమ అవయవాల (లింబ్స్, కాలిపర్స్) ఫిట్​మెంట్ శిబిరం నిర్వహించారు. ఏపీ మంత్రి టీజీ భరత్‎తో కలిసి ఈ శిబిరాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మొత్తం 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను అందజేశారు. 

గవర్నర్ మాట్లాడుతూ.. ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు అందించి పునర్జన్మ ఇవ్వడం నిజమైన మానవత్వమన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. ఇది కేవలం సేవ మాత్రమే కాదని, జీవితాలను మార్చే ఒక గొప్ప ఉద్యమమని ప్రశంసించారు. త్వరలో ఏపీలోనూ ఇలాంటి శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దేవేంద్ర చౌబిసా, రాహుల్, సత్య భూషణ్ జై పాల్గొన్నారు.