భూ సేకరణకే ప్రాధాన్యం...నారాయణపేట– కొడంగల్ లిఫ్ట్ అంచనాల పెంపు అందుకే

భూ సేకరణకే ప్రాధాన్యం...నారాయణపేట– కొడంగల్ లిఫ్ట్ అంచనాల పెంపు అందుకే
  •     పెరిగిన రూ.1779 కోట్లలో రూ.1197 కోట్లు భూసేకరణకు కేటాయింపు
  •     మొదటి దశలో 2703 ఎకరాలు.. రెండో దశలో 3699 ఎకరాలు సేకరించనున్న ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు : నారాయణపేట –కొడంగల్ లిఫ్ట్ స్కీంను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టులకు భూ సేకరణే సమస్యగా మారుతుండడంతో తొలుత దానినే చేపట్టాలని భావిస్తున్నది. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 

అయితే రూ.2,945.50 కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు.. తాజాగా క్యాబినెట్ లో చర్చించి అంచనాలను రూ.4,725 కోట్లకు పెంచింది. దీంతో రూ. 1,779.50 కోట్లు అదనంగా పెరిగింది. పెరిగిన అంచనాల్లో కేవలం భూసేకరణకు రూ.1197.61 కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే ప్రాజెక్టు మొత్తానికి ఒకేసారి భూమి సేకరించాలని నిర్ణయించడంతోనే అంచనాలు పెరిగాయని అధికారులు చెప్తున్నారు.

పరిహారం పెంచిన్రు..

వాస్తవానికి తొలుత ప్రాజెక్టు పంప్ హౌస్ లకే భూ సేకరణ చేయాలనుకున్నారు. దీనికి రూ.77 కోట్ల వరకు ఖర్చు అవుతుందని భావించారు. కానీ ప్రాజెక్ట్ మొత్తంలో ఉండే రిజర్వాయర్లు, కాల్వలు వంటి వాటికి పూర్తిగా భూ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా 6,372.73 ఎకరాల భూమి అవసరం అవుతుందని అధికారులు లెక్క తేల్చారు. దీంతో పరిహారానికే మొత్తంగా రూ.1,274.55 కోట్లు ఖర్చు అవుతుందని నిర్ధారించారు. అంటే భూసేకరణకు అదనంగా రూ.1197.61 కోట్లు పెరిగింది. రైతులకు ఇచ్చే పరిహారాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. 

ఎకరానికి రూ.20 లక్షలు ఇవ్వనుంది. రెండు దశల్లో ప్రభుత్వం భూ సేకరణ చేపడుతుంది. మొదటి దశలో 2703.73 ఎకరాలను సేకరించనుంది. అందుకు రూ.540.75 కోట్లు పరిహారంగా ఇవ్వాలని నిర్ణయించింది.
 రెండో దశలో మిగతా 3,669 ఎకరాలు సేకరించనుండగా.. అందుకు రూ.733.80 కోట్లు ఖర్చు చేస్తుంది. 

ప్రాజెక్టు స్వరూపం.. 

నారాయణపేట– కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును ప్రభుత్వం రెండు దశల్లో చేపట్టనుంది. మొదటి దశలో భాగంగా ఊట్కూరు, జయమ్మ, కానుకుర్తి ట్యాంకులను ఆధునీకరించనున్నారు. రెండో దశలో జాజాపూర్, దౌల్తాబాద్, బొంరాస్పేట్, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, హస్నాబాద్, కొడంగల్ చెరువుల సామర్థ్యాన్ని పెంచనున్నారు. తొలి దశలో కానుకుర్తి చెరువు సామర్థ్యాన్ని ఒకటిన్నర టీఎంసీకి పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

రిజర్వాయర్ల సామర్థ్యాన్ని మొత్తంగా నాలుగు టీఎంసీలకు పెంచనున్నారు. కాగా రాజీవ్ భీమా లిఫ్ట్ ఆధారంగా నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్ ను.. ఈ ప్రాజెక్టుకు సోర్సుగా వాడనున్నారు. భూత్పూర్ నుంచి ఊట్కూరుకు నీటిని ఎత్తిపోయనున్నారు. అక్కడి జుంచి జయమ్మ ట్యాంక్.. అటు నుంచి కానుకుర్తికి తరలిస్తారు. దీంతో కానుకుర్తి రిజర్వాయర్ నారాయణపేట –కొడంగల్ లిఫ్ట్ లో కీలకం కానుంది.