బిల్లుల కోసం రూ. 25 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన నర్సాపూర్ ఏడీఈ రమణారెడ్డి

బిల్లుల కోసం రూ. 25 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన  నర్సాపూర్ ఏడీఈ రమణారెడ్డి

మెదక్ జిల్లాలో   బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్‌ను వేధిస్తూ లంచం డిమాండ్ చేసిన ఒక ఉన్నతాధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నర్సాపూర్ సబ్ డివిజన్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రమణారెడ్డి.. ఓ కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లులు చెల్లించేందుకు గానూ భారీగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. బాధితుడి నుండి ఏడీఈ రమణారెడ్డి రూ. 25 వేల  నగదు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి అతడిని  పట్టుకున్నారు.

రమణారెడ్డి చేతులకు కెమికల్ టెస్టులు నిర్వహించి, లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నర్సాపూర్‌లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.