సెప్టెంబర్ 12న రాష్ట్రంలో నేషనల్ లోక్ అదాలత్

సెప్టెంబర్ 12న రాష్ట్రంలో నేషనల్ లోక్ అదాలత్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 12న రెండో నేషనల్ లోక్ అదాలత్‌‌‌‌ను నిర్వహించనున్నారు. హైకోర్టు స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు అన్ని కోర్టుల్లో ఈ వేదిక అందుబాటులో ఉంటుందని స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(టీఎస్ఎల్ఎస్ఏ) మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి ఓ ప్రకటనలో వెల్లడించారు. కోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులతో పాటు, ఇంకా కోర్టుకు చేరని ప్రీ-లిటిగేషన్ కేసులను కూడా దీని ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.

లోక్ అదాలత్ వేదిక ద్వారా సివిల్ వివాదాలు, రాజీపడదగిన క్రిమినల్ కేసులను ఇరువర్గాల అంగీకారంతో సత్వరం పరిష్కరించుకోవడానికి గొప్ప అవకాశం లభిస్తోందని తెలిపారు. దీనికోసం ఎలాంటి అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాకుండా, పెండింగ్ కేసులలో ఇదివరకే చెల్లించిన కోర్టు ఫీజును కూడా పూర్తిగా వెనక్కి ఇస్తారని వివరించారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.