
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఓబీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వచ్చే నెల 7న గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సమావేశానికి దేశంలోని 28 రాష్ట్రాల నుంచి సుమారు 10వేల మంది ఓబీసీ ప్రతినిధులు హాజరవనున్నట్లు వివరించారు.
ఈ మహాసభను ఏటా ఆగస్టు 7న నిర్వహించడానికి కారణం.. స్వర్గీయ మాజీ ప్రధాని వీపీ సింగ్, మండల కమిషన్ సిఫార్సులను అమలు చేస్తూ ఓబీసీలకు ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్లు ప్రకటించడమేనని గుర్తుచేశారు. ఈ సందర్భంగా దేశంలోని అన్ని బీసీ ఉద్యమ శక్తులను, వ్యక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఓబీసీల సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.