ఉపాధి సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా యాత్రలు : డీవైఎఫ్ఐ

ఉపాధి సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా యాత్రలు : డీవైఎఫ్ఐ

ముషీరాబాద్, వెలుగు: ఉపాధి సమస్యల పరిష్కారం, లౌకిక భారతదేశ సాధన కోసం దేశవ్యాప్తంగా యాత్రలు చేపడతామని డీవైఎఫ్ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగ్న రాజ్ భట్టాచార్య పేర్కొన్నారు. రెండ్రోజుల పాటు జరిగిన డీవైఎఫ్ఐ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్​లో హిమాగ్న రాజ్ భట్టాచార్య మాట్లాడుతూ.. రెజర్లపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్​తోపాటు మరో ఎంపీ సందీప్ సింగ్​పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

మూఢత్వాన్ని పెంపొందించేలా ప్రభుత్వం పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలన్నింటిన్నీ ప్రైవేటు పరం చేస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వెల్లడించారు. రెజర్లపై నిరంకుశంగా వ్యవహరిస్తూ దాడులు, అరెస్టులు చేయడాన్ని నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ అఖిల భారత కార్యదర్శివర్గ సభ్యులు జెక్ థామస్, ఆనగంటి వెంకటేశ్, సంజీవ్ కుమార్, కేంద్ర కమిటీ సభ్యులు ఇర్ఫాన్ గుల్, కోట రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.