Naveen Polishetty: 'మేడమ్ మీరు సూపర్.. మా సినిమాలో నటించండి'.. సీపీ సుమతికి నవీన్ పోలిశెట్టి క్రేజీ రిక్వెస్ట్!

Naveen Polishetty: 'మేడమ్ మీరు సూపర్.. మా సినిమాలో నటించండి'.. సీపీ సుమతికి నవీన్ పోలిశెట్టి క్రేజీ రిక్వెస్ట్!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉన్నా తనదైన హాస్యంతో వాతావరణాన్ని సందడిగా మార్చేస్తారు. తెరపై కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే ఆయన.. నిజ జీవితంలోనూ అదే సరదా స్వభావంతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. లేటెస్ట్ గా హైదరాబాద్‌లో మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన నవీన్ తన చమత్కార వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూయించారు.

మేడమ్ మీ నటన సూపర్..

ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల మహిళల భద్రత కోసం మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి అండర్‌కవర్ ఆపరేషన్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని ప్రస్తావించిన నవీన్.. సుమతి మేడమ్ అద్భుతంగా నటించారు. నా నెక్స్ట్ సినిమాలో ఆమె కచ్చితంగా యాక్ట్ చేయాలి. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సీక్వెల్‌లో నేను, సుమతి మేడమ్ కలిసి ఒక కేసును ఛేదిస్తే బాగుంటుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించగా సభలో చప్పట్లు మార్మోగాయి.

డీజీపీ పంచ్.. నవీన్ కౌంటర్..

ఇదే వేదికపై నవీన్ పోలీసులను ఉద్దేశించి.. 'సార్… నాకు గన్ ఎలా పట్టుకోవాలో కాస్త నేర్పించండి' అని అడిగాడు. దానికి డీజీపీ సీవీ ఆనంద్ స్పందిస్తూ.. 'ట్రైనింగ్ ఇస్తాం కానీ… ఒరిజినల్ బుల్లెట్లతో మాత్రం కాదు' అని స్మార్ట్ పంచ్ వేశారు. దానికి నవీన్  'మా సినిమాల్లో అన్నీ ఫేక్ బుల్లెట్లే ఉంటాయి సార్… అయినా నాకు గన్ ఎత్తడం కూడా రాదు' అని పంచ్ వేయడంతో సభలో ఆఫీసర్లంతా గట్టిగా నవ్వేశారు.

తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో..

ఈ సందర్భంగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్ కూడా ఇచ్చారు నవీన్. తన కెరీర్‌లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడూ కామెడీ, డిటెక్టివ్ రోల్స్ చేసిన నవీన్.. ఖాకీ డ్రెస్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇక చివర్లో ఎమోషనల్ అవుతూ.. కష్టం వస్తే దేవుడిని తలుచుకుంటాం, కానీ ఆ దేవుడు పంపే ప్రతినిధులు పోలీసులే. ఆపదలో ధైర్యాన్నిచ్చే నిస్వార్థ వీరులకు నా సెల్యూట్ అంటూ పోలీస్ శాఖపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు.