
టీమిండియా మాజీ క్రికెటర్, పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె స్టేజీ 2లో ఉన్నారు. దీంతో జైలులో ఉన్న తన భర్తను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. " మీరు చేయని నేరానికి జైలులో ఉన్నారు. దీనికి కారణమైన వారందరినీ క్షమించండి. బయట ఉన్న నేను.. నీ కంటే ఎక్కువగా బాధపడుతూ..ప్రతి రోజు మీ కోసం ఎదురుచూస్తున్నాను. నాకు క్యాన్సర్ సెకండ్ స్టేజ్ అని తేలింది. మీ కోసం నేను ఇంకా ఎంతో కాలం వేచి ఉండలేను. సర్జరీకి వెళ్తున్నా. దీనికి ఎవ్వర్నీ నిందించలేము. ఎందుకంటే అది దేవుడు చేసిన నిర్ణయం" అంటూ ఎమోషనల్ అయింది.
ఈ ట్వీట్‌పై కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ స్పందిస్తూ మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశాడు. 34 ఏళ్ల క్రితం ఓ ఘర్షణకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సిద్ధూను దోషిగా నిర్ధారించింది. మే 2022 నుంచి ఆయన పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 1988 డిసెంబరు 27న పాటియాలో పార్కింగ్ విషయంలో 65ఏళ్ల గుర్నామ్ సింగ్‌కు సిద్ధూ, తన స్నేహితుడు రూపిందర్ సింగ్‌లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుర్నామ్ సింగ్ మృతి చెందాడు.
గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సిద్ధూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రమశిక్షణారాహిత్యంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పార్టీ అతనిపై చర్యలు తీసుకుంది.