RBI నిర్వాకం.. రూ.20 వేల కోట్లు ఎగ్గొట్టినోడికి ఎన్‌‌బీఎఫ్‌సీ లైసెన్స్!

RBI నిర్వాకం.. రూ.20 వేల కోట్లు ఎగ్గొట్టినోడికి ఎన్‌‌బీఎఫ్‌సీ లైసెన్స్!

బ్యాంక్‌‌లకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, ఇండియాకు తిరిగొచ్చి కొత్తగా ఓ నాన్‌‌ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌‌బీఎఫ్‌ సీ) పెడతాను, లైసెన్స్ ఇస్తారా…అనడిగితే… ఆర్‌‌‌‌బీఐ లైసెన్స్ ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదట. ఎందుకంటే ఇప్పటికే వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి , బ్యాంక్‌‌లకు, ఆర్థిక సంస్థలకు చుక్కలు చూపిస్తున్న ఓ పవర్ కంపెనీ ప్రమోటర్‌‌‌‌కు, ఆర్‌‌‌‌బీఐ ఎంచక్కా ఎన్ బీఎఫ్‌ సీ లైసెన్స్ చేతిలో పెట్టి స్వాగతించింది.

ఇప్పటికే ఓ కంపెనీని దివాలా తీయించిన ప్రమోటర్‌‌కు, ఎన్‌‌బీఎఫ్‌ సీ లైసెన్స్‌‌ కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలే ఎన్‌‌బీఎఫ్‌ సీ అంటే డబ్బు తీసుకోవడం, ఇవ్వడమే ప్రధాన వ్యాపారమవుతుంది. ఆ ప్రమోటర్‌‌ గతంలో నెలకొల్పిన పవర్‌‌‌‌ కంపెనీ డిసెంబర్ 2014 నుంచి బ్యాంక్‌‌లకు, ఆర్థిక సంస్థలకు డబ్బులు చెల్లించలేక చేతులెత్తేసింది. రుణాలను రీషెడ్యూల్ చేసినా కూడా.. తిరిగి అప్పులు చెల్లించలేకపోయింది. కంపెనీ ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సంక్షోభంతో, రేటింగ్ ఏజెన్సీలన్నీ వరుసబెట్టి పవర్ కంపెనీకి రేటింగ్‌‌ను డౌన్‌‌గ్రేడ్ చేశాయి. మొత్తంగా ఈ కంపెనీ రూ.7,942 కోట్ల అప్పులను బ్యాంక్‌‌లకు, ఆర్థిక సంస్థలకు బాకీ పడింది. ఈ కంపెనీ మాత్రమే కాక, దాని సబ్సిడరీలు మరో రూ.4,240 కోట్ల వరకు బ్యాంక్‌‌లకు చెల్లించకుండా ఎగనామం పెట్టాయి. మొత్తంగా కన్సాలి డేషన్‌‌ బేసిస్‌‌లో ఈ కంపెనీ రు ణాలు రూ.12వేల కోట్ల పైననే.

ఒకవైపు తమ డబ్బులు తమకు చెల్లించండంటూ బ్యాంక్‌‌లు, ఆర్థిక సంస్థలు ఈ కంపెనీ చుట్టూ తిరుగుతుంటే..ఈ కంపెనీ ప్రమోటర్ మాత్రం ఎంచక్కా అప్పటికే ఉన్న ఒక ఎన్‌‌బీఎఫ్‌ సీని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వండంటూ ఆర్‌‌‌‌బీఐ వద్దకు వెళ్లారు . ఈ విషయాలను పరిగణలోకి తీసుకుందో లేదో తెలియదు కానీ, ఆర్‌‌‌‌బీఐ ఆ ప్రమోటర్‌‌‌‌కు 2016 నవంబర్‌‌‌‌లో ఎన్‌‌బీఎఫ్‌ సీ కొనుగోలుకు అనుమతి ఇచ్చేసింది. గ్రూప్ కంపెనీ రుణ వ్యవహారం రచ్చ జరుగుతున్న సమయంలోనే, ఆర్‌‌‌‌బీఐ లైసెన్స్‌‌ కూడా మంజూరు చేసింది. బ్యాంక్‌‌లకు, ఆర్థిక సంస్థలకు డబ్బులు కట్టేందుకు వెనకాడిన ఈ ప్రమోటర్ 2017 జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో ఆ ఎన్‌‌బీఎఫ్‌ సీలో రూ.400 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈయన, తన భార్య ఇద్దరూ కలిసి పాత డైరెక్టర్ల నుంచి ఈ ఎన్‌‌బీఎఫ్‌ సీ పగ్గాలను తమ చేతుల్లోకి తీసేసుకున్నారు . ఆర్‌‌‌‌బీఐ ఈ కంపెనీకి 2017 జూన్‌‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు కూడా కాస్త జాలి చూపించింది.

కొత్త ఎన్‌‌బీఎఫ్‌సీ వైపుకి మరలిన పవర్‌‌ కంపెనీ ప్రమోటర్, రుణాల చెల్లింపును గాలికి వదిలేశారు. పవర్ కంపెనీ రుణాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా మొత్తం రుణం రూ.20వేల కోట్లకు ఎగిసింది. అయినా కూడా ప్రమోటర్ పట్టించుకోలేదు. 2018 మార్చిలో ఒక గ్లోబల్ ఫండ్ ద్వారా రూ.650 కోట్ల పెట్టుబడులు పెట్టి ఆ ఎన్‌‌బీఎఫ్‌ సీలో 50 శాతం ఈక్విటీ సొంతం చేసుకున్నారే తప్ప బ్యాంక్‌‌లకు, ఆర్థిక సంస్థలకు అప్పులు తిరిగివ్వలేదు. ఆ ఎన్‌‌బీఎఫ్‌ సీలో తన 50 శాతం వాటాను కాపాడుకోవడానికి మరోసారి రూ.250 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఈ పెట్టుబడులకు కూడా ఆర్‌‌‌‌బీఐ పర్మిషన్లు ఇస్తూనే ఉంది. కానీ పవర్ కంపెనీ రుణాలు పరిస్థితి అసలు పట్టించుకోలేదు. 2018 ఏప్రిల్‌ లో కేర్‌ ఆ ఎన్‌‌బీఎఫ్‌ సీకి అత్యధిక రేటింగ్ ఏ1+ ఇచ్చింది. 2018 సెప్టెంబర్‌‌‌‌ 30న ఆ ఎన్‌‌బీఎఫ్‌ సీ సంస్థ యస్ బ్యాంక్, క్యాపిటల్ ఫస్ట్ నుంచి మరో రూ.100 కోట్ల నిధులను సేకరించింది. అదనంగా రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ నుంచి రూ.272 కోట్ల విలువైన మూలధన సమీకరణ పొందింది. పెట్టుబడులు, నిధుల సేకరణ పెరుగుతుండటంతో కేర్ రేటింగ్‌‌లను పెంచింది. కానీ పవర్ కంపెనీ రుణదాతల పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. పవర్ కంపెనీకి వ్యతిరేకంగా బ్యాంక్‌‌లు, ఆర్థిక సంస్థలు ఎన్‌‌సీఎల్‌ టీని ఆశ్రయించారు.

50శాతంతో సరిపెట్టు కుంటున్నాయి
ఆఖరికి ఈ ప్రమోటర్ బ్యాంకులతో వన్‌‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ చేసుకునే ప్రయత్నాలూ మొదలుపెట్టారు . ఇందుకవసరమైన నిధుల సమీకరణకు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకర్‌‌ను కూడా నియమించుకున్నారు . బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన మొత్తం రుణాలు రూ. 20 వేల కోట్ల దాకా ఉండగా, ఒన్‌‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ కింద రూ. 4,200 కోట్ల నుంచి రూ. 9,000 కోట్ల చెల్లింపుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. అంటే, సగాని కంటే తక్కువే! మరోవిధంగా చూస్తే, ఈయన పవర్‌‌ బిజినెస్‌‌కు అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మాత్రం చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమని, 50 శాతంతో సరిపెట్టుకోవల్సి వస్తోందన్నమాట. పబ్లిక్‌‌ ఫండ్స్‌‌ను యధేచ్చగా వ్యాపారానికి వాడుకుని, ఆ తర్వాత వన్‌‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ పేరుతో బ్యాంకులకు టోపీ పెట్టిన ఇలాంటి ప్రమోటర్‌‌కు ఎన్‌‌బీఎఫ్‌ సీ వ్యాపారం చేసుకుని మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లమని లైసెన్స్‌‌ జారీ ద్వారా ఆర్‌‌బీఐ చెప్పినట్లవుతోంది. కేవలం వేల రూపాయలు బాకీ పడితేనే రైతులను తీవ్రంగా వేధించే ఆర్థిక సంస్థలు, బ్యాంక్‌‌లు… వేల కోట్లు బాకీ పడిన ఘరానా పారిశ్రామిక వేత్తలకు మాత్రం వీలైనన్ని ఎక్కువ రాయితీలు ఎలా ఇవ్వాలా..? అని బ్యాంక్‌‌లు ఆలోచించడం దురదృష్టకరమని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ప్రజాధనాన్ని దుర్వినియోగ పరుస్తున్నా కూడా.. రెగ్యులేటర్లు, బ్యాంక్‌‌లు, మ్యూచువల్ ఫండ్స్, రేటింగ్ ఏజెన్సీలు పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరో విజయ్‌ మాల్యా..
బ్యాంకులను నిలువునా ముంచుతున్న ఈ పెద్ద మనిషి ఎవరో తెలుసా ? రతన్‌‌ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లి మిటెడ్‌‌కు చెందిన రాజీవ్ రతన్. రతన్‌‌ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకముందు పేరు విఖ్యాత్ ఫిన్‌‌లీజ్ అండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ పవర్ కంపెనీ రతన్ ఇండియా పవర్ లిమిటెడ్. రతన్‌‌ఇండియా పవర్‌‌‌‌కు చైర్మన్‌‌గా, రతన్‌‌ఇండియా ఫైనాన్స్‌‌కు సీఈవో, డైరెక్టర్‌‌‌‌గా రాజీవ్ రతన్‌‌ ఉన్నారు . విజయ్‌‌మాల్యాకు, రాజీవ్ రతన్‌‌లకు పెద్దగా తేడా ఏమీ లేదు. ఈ ఇద్దరూ బ్యాంక్‌‌లకు డబ్బులు చెల్లించకుండా డి ఫాల్డ్ అయిన వారే. ఫండ్లను ఇతర కార్యకలాపాలకు మళ్లించినవారే. పైగా ఈ పవర్‌‌‌‌ కంపెనీ యజమాని రాజీవ్ రతనే ఇంకా విజయ్ మాల్యా కంటే రెండింతలు ఎక్కువ మొత్తంలో బాకీ పడ్డారు . అయినా ఇవేమీ పట్టింపు లేకుండా రతన్‌‌కు ఎన్‌‌బీఎఫ్‌సీ లైసెన్స్ వచ్చేసింది.