బీఎస్పీ నుంచి నీలం మధు పోటీ : పటాన్​చెరు నుంచి నామినేషన్

బీఎస్పీ నుంచి నీలం మధు పోటీ : పటాన్​చెరు నుంచి నామినేషన్
  • బీఎస్పీ నుంచి నీలం మధు పోటీ
  • పటాన్​చెరు నుంచి నామినేషన్  
  • పటాన్​చెరు, నారాయణఖేడ్​లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్
  • సంగారెడ్డి బీజేపీలో హైడ్రామా 
  • రాజేశ్వర్​ రావు దేశ్​పాండే ప్లేస్​లో పులి మామిడి రాజుకు బీ ఫాం

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో నామినేషన్లకు ఆఖరు రోజైన శుక్రవారం హైడ్రామా కొనసాగింది. కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను మార్చడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పటాన్ చెరు, నారాయణ్ ఖేడ్ అభ్యర్థులను కాంగ్రెస్ మార్చింది. సంగారెడ్డి అభ్యర్థిని మార్చిన బీజేపీ.. మళ్లీ చివరికి మొదటి వ్యక్తికే బీఫామ్ ఇచ్చింది. మొదట పటాన్ చెరు టికెట్ ను నీలం మధుకు కేటాయించిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో కాటా శ్రీనివాస్​గౌడ్​ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని నీలం మధు ప్రకటించారు. ఆ తర్వాత బీఎస్పీ స్టేట్ చీఫ్​ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు. బీఎస్పీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేశారు. ఇక నారాయణఖేడ్ నుంచి మొదట సురేశ్ షెట్కార్​కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో సంజీవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. షెట్కార్​కు ఎంపీ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన కాంప్రమైజ్ అయ్యి, సంజీవ రెడ్డికి మద్దతు ఇవ్వడంతో ఆయన శుక్రవారం నామినేషన్ వేశారు. 

సూసైడ్ చేసుకుంటానన్న దేశ్ పాండే..  

సంగారెడ్డి బీజేపీలో శుక్రవారం హైడ్రామా కొనసాగింది. మొదట నియోజకవర్గ అభ్యర్థిగా రాజేశ్వర్ రావు దేశ్ పాండేను బీజేపీ ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో పులిమామిడి రాజుకు బీఫామ్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న దేశ్​పాండే.. పార్టీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ ​రెడ్డికి ఫోన్ ​చేసి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీ అంతట మీరే టికెట్ ఇచ్చి ఇలా చేయడం కరెక్టు కాదు. నాకు, నా కుటుంబానికి నష్టం చేశారు. మాకేం జరిగినా మీరే బాధ్యులవుతారు. నేను సూసైడ్ చేసుకుంటాను” అని బెదిరించారు. చివరికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.