కలబురగి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్ యూజీ –2026’ పరీక్ష రద్దు నిర్ణయం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా కర్నాటకలోని కలబురగి జిల్లాకు చెందిన భాగ్యశ్రీ(18) తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ఇటీవల పీయూసీ పరీక్షల్లో ఆమె 92% మార్కులు సాధించింది. మే 2న నీట్ పరీక్ష రాసింది. అయితే, పేపర్ లీక్ ఆరోపణలతో పరీక్ష రద్దు కావడంతో భాగ్యశ్రీ డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుంది.
ఘటనాస్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, మే 16న రాజస్తాన్‌లోనూ ప్రదీప్ మేఘవాల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ పరీక్షలో 650 మార్కులు వస్తాయని ఆశించిన ప్రదీప్.. పరీక్ష రద్దు వార్తతో తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు.
