- పరీక్ష రాయనున్న 17,600 మంది అభ్యర్థులు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా నీట్–పీజీ 2026 ప్రవేశ పరీక్ష నిర్వహణకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆదివారం జరిగే ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులు పరీక్ష రోజు పాటించాల్సిన మార్గదర్శకాలను బోర్డు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 56 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 17,600 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఒకే షిఫ్ట్ లో ఎగ్జామ్ జరగనుంది. అభ్యర్థులు నిర్దేశిత ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉదయం 7 గంటలకే రిపోర్టింగ్ కౌంటర్ వద్ద హాజరు కావాలని బోర్డు స్పష్టం చేసింది. ఉదయం 8:30 గంటలకే ఎగ్జామ్ సెంటర్ల గేట్లను పూర్తిగా మూసివేస్తారు. ఆ సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఎగ్జామ్ సెంటర్లలోకి ఇవి నిషేధం
ఎగ్జామ్ హాల్ లోకి స్టేషనరీ సామగ్రి, ముద్రించిన కాగితాలు, నోట్స్, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, పెన్నులు, ఎరేజర్లను అనుమతించరు. మొబైల్ ఫోన్లు, ఇయర్‌ఫోన్లు, మైక్రోఫోన్లు, పేజర్లు, చేతి గడియారాలు, స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు, రింగులు, ఏఐ ఆధారిత కళ్లద్దాలు, పెన్ డ్రైవ్‌లు, స్కానర్లు, టాబ్లెట్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ లేదా బ్లూటూత్ పరికరాలపైనా నిషేధం విధించారు. అయితే, వైద్య అవసరాల కోసం మందులు లేదా ఇతర సహాయక పరికరాలు తీసుకెళ్లాల్సిన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
వదంతులు నమ్మొద్దు
వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్స్ ద్వారా ప్రశ్నపత్రాలు, ఆన్సర్ కీ ఇస్తామంటూ ప్రచారం చేసే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని బోర్డు హెచ్చరించింది. అటువంటి సమాచారం లేదా వ్యక్తుల వివరాలను వెంటనే reportumc@natboard.edu.in ఈమెయిల్ ద్వారా స్థానిక పోలీసులకు తెలియజేయాలని సూచించింది. పరీక్షకు సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్‌సైట్, అధికారిక సోషల్ మీడియా అకౌంట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.
