నీట్ రీ టెస్ట్తో ఆందోళన..మహారాష్ట్రలో విద్యార్థిని సూసైడ్

నీట్ రీ టెస్ట్తో ఆందోళన..మహారాష్ట్రలో విద్యార్థిని సూసైడ్
  •     మహారాష్ట్రలో విషాదం

అహిల్యానగర్ (మహారాష్ట్ర): నీట్ రీ- ఎగ్జామినేషన్ ఫలితాల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఓ యువతి తీవ్ర మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది. మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా కర్జత్ తాలూకా జలాల్‌పూర్ గ్రామంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన 19 ఏండ్ల యువతి నీట్ రీ-టెస్ట్‌లో 166 మార్కులు సాధించింది. అర్హత కోసం నిర్ణయించిన 177 కటాఫ్ మార్కుల కంటే తక్కువ రావడంతో తీవ్ర నిరాశకు గురైంది. శనివారం తండ్రి, సోదరుడు పండరీపూర్ యాత్రకు వెళ్లగా, తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమయ్యారు. 

గదిలో ఒంటరిగా ఉన్న యువతి ఎంతకీ బయటకు రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా, అప్పటికే ఆమె ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించింది. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో.. ‘నీట్ రీ-టెస్ట్‌లో కటాఫ్‌కు 166 మార్కులే వచ్చాయి. డాక్టర్ కావాలనే నా స్వప్నం నెరవేరలేదు. ఈ వైఫల్యంతో తీవ్ర మనస్తాపం చెందా’ అని పేర్కొంది.