- సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ ఎమ్మెల్సీ సత్యం లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో 25 నుంచి 30 ఏండ్లుగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. నిరవధిక సమ్మెకు దిగిన ఆర్టిజన్ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వారి సమస్యలపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2017లో ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చి, ప్రమోషన్లు, సెలవులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు.
తాగునీరు, లైటింగ్ వంటి కనీస సదుపాయాలు లేని సబ్ స్టేషన్లలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. విద్యార్హతను బట్టి ఆర్టిజన్ కార్మికులందరికీ జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్ తదితర కన్వర్షన్ చేయాలని కోరారు. ఎస్పీడీసీఎల్ తరహాలోనే ఎన్పీడీసీఎల్పరిధిలోని మానవరహిత వర్కర్స్, 2016 నుంచి చిన్న చిన్న అభ్యంతరాలతో పక్కనపెట్టిన కార్మికులను సంస్థలో విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ప్రతి 4 ఏండ్లకుఒకసారి ఇచ్చే 'పీఆర్సీ–-2026'ను అమలు చేయాలని కోరారు.

