మా దేశంలో ఆడుకోండి.. నేపాల్ క్రికెట్‌కు భారత విదేశాంగ మంత్రి బంపర్ ఆఫర్

మా దేశంలో ఆడుకోండి.. నేపాల్ క్రికెట్‌కు భారత విదేశాంగ మంత్రి బంపర్ ఆఫర్

నేపాల్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో చాలా తక్కువ మందికే తెలుసు. అసోసియేట్ దేశమైనా, స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు. నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు. సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లు ఎక్కి మ్యాచ్ లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా నేపాల్ కు భారత విదేశాంగ మంత్రి బంపర్ ఆఫర్ ఇచ్చాడు.   

భారత క్రికెట్ మైదానాన్ని నేపాల్ క్రికెట్ జట్టు తమ 'హోమ్ గ్రౌండ్'గా ఉపయోగించుకోవచ్చని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆ దేశ క్రికెట్ కు శుభవార్త చెప్పాడు. ఈ విషయాన్ని నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ మంగళవారం (జనవరి 9) స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నేపాల్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఈ వార్త కిక్ ఇస్తుంది. క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో అద్భుతంగా ఆడిన నేపాల్ 2024 లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు నేపాల్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.      

ఇండియా-నేపాల్ జాయింట్ కమిషన్ 7వ సమావేశానికి కో-అధ్యక్షునిగా నేపాల్ విదేశాంగ మంత్రి NP సౌద్ ఆహ్వానం మేరకు జైశంకర్ 2024 జనవరి 4, 5 తేదీల్లో ఖాట్మండును సందర్శించారు. ఈ పర్యటనలో జైశంకర్ తన స్వంత చొరవతో నేపాలీ క్రికెట్ జట్టును కలిశాడు. జైశంకర్ సమావేశానికి సంబంధించిన స్నాప్‌లను పంచుకున్నారు. భారత్ లో గనుక నేపాల్ క్రికెట్ మ్యాచ్ లాడితే మరో కొన్నేళ్లలో బలమైన జట్టుగా మారుతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.