9 కిలోల వెండిని ఢిల్లీలో వదిలేసిన నేపాలీ దొంగలు

9 కిలోల వెండిని ఢిల్లీలో  వదిలేసిన నేపాలీ దొంగలు

    9 కిలోల వెండి స్వాధీనం

జూబ్లీహిల్స్,  వెలుగు: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల15న జరిగిన దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాము పని చేస్తున్న ఇంట్లో భారీ చోరీ చేసిన నేపాలీ దొంగలు పారిపోతూ 9 కిలోల వెండిని ఢిల్లీలో వదిలిపోయారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్​ఓబుల్ రెడ్డి స్కూల్​వెనుక గేటు ఎదురుగా ఉన్న రోడ్ నంబర్ 25లోని ప్లాట్ నంబర్ 305లో వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి, దీపికా రెడ్డి ఉంటున్నారు. 

వీరి ఇంట్లో పని చేస్తున్న నేపాలీలు సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను దొంగిలించి పరారయ్యారు. ఈ కేసును సీరియస్​గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలోని ఓ ప్రాంతంలో వదిలివెళ్లిన 9 కిలోల వెండి మూటను స్వాధీనం చేసుకున్నారు. వజ్రాభరణాలతో నేపాల్‌‌ పారిపోయే క్రమంలో బరువు తగ్గించుకునేందుకు వెండిని వదిలివెళ్లినట్లు వెల్లడైంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మహేశ్ షాహి (32), అప్సర షాహి ఇప్పటికే నేపాల్‌‌కు చేరుకున్నట్లు సమాచారం.