- ఆపరేషన్ థియేటర్లు షేర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెద్ద హాస్పిటల్స్ అయిన నిమ్స్, ఉస్మానియాలో సర్జరీల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితికి చెక్ పెట్టేందకు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ హాస్పిటల్స్ కు పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉండటం, ఆపరేషన్ థియేటర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో.. చికిత్స కోసం వచ్చే రోగులకు రెండు, మూడు నెలలకు డేట్ ఇస్తున్న పరిస్థితి ఉన్నది. దీంతో నిమ్స్ హాస్పిటల్ పేషెంట్లకు సర్జరీలు చేసుకునేందుకు సనత్ నగర్ టిమ్స్ ను ఉపయోగించుకునేలా.. అలాగే, ఉస్మానియా పేషెంట్ల కోసం.. గాంధీలో నిర్మించిన మాడ్యులర్ థియేటర్లను వినియోగించుకునేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నది.
డాక్టర్లు ఉన్నా.. సర్జరీ చేయలేని పరిస్థితి..
నిమ్స్, ఉస్మానియాలో కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్, న్యూరో సర్జరీ, కార్డియాక్ వంటి క్లిష్టమైన ఆపరేషన్ల కోసం పేషెంట్లు క్యూ కడుతున్నారు అయితే, ఒక్కో విభాగానికి వారంలో కేవలం రెండు రోజులే థియేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో డాక్టర్లు సర్జరీ చేయడానికి సిద్ధంగా ఉన్నా.. థియేటర్లు ఖాళీ లేక రోగులకు నెలల తర్వాత డేట్లు ఇస్తున్నారు. ఈ లోగా కొందరి పరిస్థితి విషమించడం, మరికొందరు అప్పులు చేసి ప్రైవేట్ దవాఖానాలకు పరుగులు తీయడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితికి ముగింపు పలకడమే లక్ష్యంగా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
నిమ్స్ ఆపరేషన్లు టిమ్స్ లో..
సనత్ నగర్ లో నిర్మించిన టిమ్స్ హాస్పిటల్ ఇక నిమ్స్ రోగులకు కూడా సంజీవనిలా మారనుంది. ఇక్కడ ఏకంగా 37 ఆపరేషన్ థియేటర్లు (29 మేజర్, 8 మైనర్) అందుబాటులో ఉండటం విశేషం. దీన్ని రాష్ట్రంలో అతిపెద్ద ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్‌ప్లాంట్’గా తీర్చిదిద్దుతున్నది. కిడ్నీ, లివర్, గుండె వంటి సంక్లిష్ట ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లకు అన్ని వసతులు కల్పించింది. నిమ్స్ లో వెయిటింగ్ లిస్టులో ఉన్న పేషెంట్లను ఇక్కడికి తరలించి, నిమ్స్ డాక్టర్లే టిమ్స్ లోని అత్యాధునిక వసతులతో సర్జరీలు చేయనున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్న 300 ఐసీయూ బెడ్లు, ఓటీలు, హై-ఎండ్ సీటీ స్కాన్, ఎంఆర్ఐ, క్యాథ్ ల్యాబ్ వంటి వసతులు నిమ్స్ రోగులకూ ఉపయోగపడనున్నాయి.
ఉస్మానియా పేషెంట్లకు గాంధీ..
శిథిలావస్థకు చేరిన భవనాలతో ఉస్మానియా దవాఖానాలో సర్జరీలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గాంధీ హాస్పిటల్ లోని హైటెక్ ఓటీలను వాడుకోనున్నారు. గాంధీలో సుమారు 40 కోట్లతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 6 అత్యున్నత స్థాయి మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఇకపై ఉస్మానియా రోగులకూ సేవలందించనున్నాయి. వంద శాతం ఇన్ఫెక్షన్ ఫ్రీగా ఉండే ఈ థియేటర్లలో లామినార్ ఎయిర్ ఫ్లో, హెపా ఫిల్టర్లు, షాడో-లెస్ ఎల్‌ఈడీ లైట్ల వంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టెక్నాలజీ ఉంది. ఉస్మానియాలోని సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వంటి కీలక విభాగాలకు చెందిన పేషెంట్లను ఇక్కడికి షిఫ్ట్ చేసి, రోబోటిక్ సర్జరీల ద్వారా పేదలకు అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. ఆపరేషన్లను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా లైవ్ లో వీక్షించేలా ఇక్కడ టెక్నాలజీ అందుబాటులో ఉండటం విశేషం.
సగానికి తగ్గనున్న వెయిటింగ్ లిస్టు..
ఈ రిసోర్స్ షేరింగ్ పద్ధతి ద్వారా పేదలకు ప్రైవేట్ హాస్పిటల్స్ తో పనిలేకుండా కార్పొరేట్ స్థాయి సర్జరీలు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఫ్రీగా అందనున్నాయి. ఆపరేషన్ ముగిసిన వెంటనే రోగులను పర్యవేక్షించేందుకు అదే ఫ్లోర్ లో ఐసీయూలు, స్టెప్ డౌన్ వార్డులు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ సెంటర్లు అన్నీ ఒకే చోట ఉండటంతో వైద్య సేవల క్వాలిటీ పెరుగుతుంది. ప్రైవేట్ లో లక్షలు పోస్తేనే అయ్యే ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు ఇప్పుడు సర్కార్ దవాఖానాల్లోనే స్పీడుగా పూర్తి కానున్నాయి. నిమ్స్ భారాన్ని టిమ్స్ కు, ఉస్మానియా కేసులను గాంధీ మాడ్యులర్ ఓటీలకు మళ్లించడం ద్వారా సర్జరీ వెయిటింగ్ లిస్టులు సగానికి పైగా తగ్గి, రోగులకు వేగవంతమైన వైద్యం అందుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
