ఫీజు కోసం సర్టిఫికెట్లు ఆపితే గుర్తింపు రద్దు చేస్తం...ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్

ఫీజు కోసం సర్టిఫికెట్లు ఆపితే గుర్తింపు రద్దు చేస్తం...ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు వార్నింగ్
  •     కంప్లైంట్స్ కోసం ప్రతి జిల్లాలో  హెల్ప్ డెస్క్‌‌‌‌ల ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ పూర్తయిన స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అరాచకాలకు ఇంటర్ బోర్డు చెక్ పెట్టింది. ఫీజు బకాయిలు ఉన్నాయన్న సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపడం చట్టరీత్యా నేరమని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. స్టూడెంట్ అడిగిన వెంటనే టీసీ, బోనఫైడ్, స్టడీ సర్టిఫికెట్లు ఇచ్చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రూల్స్ బ్రేక్ చేసి స్టూడెంట్ల భవిష్యత్తుతో ఆడుకుంటే కాలేజీల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు డీఐఈఓలకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఫీజు బకాయిలను అడ్మినిస్ట్రేటివ్ పరంగానో, చట్టపరంగానో తేల్చుకోవాలని సూచించించారు. 

కెరీర్ దెబ్బతింటే ఊరుకోం..

ప్రస్తుతం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, డిగ్రీ, నర్సింగ్ వంటి కోర్సులకు వెబ్ కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలు జరుగుతున్నాయి. ఈ టైంలో కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, వారి కెరీర్ దెబ్బతింటుందని బోర్డు సెక్రటరీ సీరియస్ అయ్యారు. బోర్డు ఆదేశాలను బేఖాతరు చేసే కాలేజీలపై కఠిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణమే షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు, అఫిలియేషన్ రద్దు చేసే ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాల్లో 'హెల్ప్ డెస్క్‌‌‌‌లు'

క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (డీఐఈఓ) కార్యాలయంలో ప్రత్యేకంగా 'హెల్ప్ డెస్క్' ఏర్పాటు చేయాలని బోర్డు సెక్రటరీ సూచించారు. కాలేజీలు వేధిస్తే విద్యార్థులు ఈ హెల్ప్ డెస్క్‌‌‌‌లలో ఫిర్యాదు చేయవచ్చని, అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి సర్టిఫికెట్లు వచ్చేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపాలని డీఐఈవోలను బోర్డు సెక్రెటరీ అభిలాష ఆదేశించారు.