- నువ్వు నీళ్లు వదిలేస్తే ఏపీ ఎత్తుకుపోతున్నది
- రాజకీయ ద్వేషంతో రాష్ట్ర రైతుల భవిష్యత్తును బలి చేస్తున్నావ్ అంటూ ఫైర్
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చేసిన ప్రమాణం ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూనే ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయని చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడటంపై శుక్రవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదని, లక్ష క్యూసెక్కుల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. ఆనాటి రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి.. మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి తెలంగాణ జలాల దోపిడీకి తలుపులు తెరిచిన పరిస్థితి తీసుకురావడం దుర్మార్గమన్నారు. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకుండా, రిజర్వాయర్లు నింపకుండా వ్యవహరిస్తున్న సీఎం వైఖరి తెలంగాణకు శాపంగా, ఏపీకి వరంగా మారిందన్నారు.
మన నీళ్లు ఏపీ ఎత్తుకుపోతున్నది..
తెలంగాణ ప్రభుత్వం నీటిని వదిలేస్తుంటే, ఏపీ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి, పురుషోత్తమపట్నం, పుష్కర ఎత్తిపోతల ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున ఇప్పటికే 60 టీఎంసీలకుపైగా నీటిని వినియోగించుకుందని హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసి చోద్యం చూస్తున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో సిద్ధంగా ఉన్న బాహుబలి పంపులను నడపకపోవడం వెనుక దాగి ఉన్న చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రైతులకు ఉపయోగపడాల్సిన నీళ్లు ఏపీకి తరలిపోతుంటే సీఎం, నీళ్ల మంత్రి ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ ద్వేషంతో రాష్ట్ర రైతుల భవిష్యత్తును బలి చేయడం క్షమించరాని నేరమని ఫైర్ అయ్యారు.
