టిమ్స్‌‌ టెక్నీషియన్‌‌ పోస్టులకు డీఎంఐటీ అభ్యర్థుల అప్లికేషన్లు తీసుకోవాలి : హైకోర్టు

టిమ్స్‌‌ టెక్నీషియన్‌‌ పోస్టులకు డీఎంఐటీ అభ్యర్థుల అప్లికేషన్లు తీసుకోవాలి :  హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌ (టిమ్స్‌‌)లో టెక్నీషియన్‌‌ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. డిప్లొమా ఇన్‌‌ మెడికల్‌‌ ఇమేజింగ్‌‌ టెక్నీషియన్‌‌ (డీఎంఐటీ) కోర్సు చేసిన అభ్యర్థుల దరఖాస్తులను కూడా స్వీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ల ఫలితాలను వెల్లడించవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీటీ స్కాన్‌‌, ఎక్స్‌‌రే, ఎంఆర్‌‌ఐ తదితర టెక్నీషియన్‌‌ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం జూన్‌‌ 22న నోటిఫికేషన్‌‌ ఇచ్చింది. 

అయితే ఇందులో డీఎంఐటీ అభ్యర్థులను అర్హుల జాబితాలో చేర్చకపోవడాన్ని సవాల్‌‌ చేస్తూ నల్గొండ జిల్లా నకిరేకల్‌‌కు చెందిన ఎం. ప్రకాశ్‌‌తో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్‌‌, జస్టిస్‌‌ జి.ఎం. మొహియుద్దీన్‌‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. డీఎంఐటీ అభ్యర్థుల అప్లికేషన్లు కూడా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.