రాములవారి మీద ఆన.. వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే: సీఎం రేవంత్‌‌రెడ్డి

రాములవారి మీద ఆన.. వచ్చేది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే: సీఎం రేవంత్‌‌రెడ్డి
  • 182 అసెంబ్లీ స్థానాల్లో  117 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తం
  • చంద్రశేఖర్‌‌‌‌రావు..  ఇప్పుడు చెప్తున్నా రాసిపెట్టుకో..  
  • 2029 మే లేదా జూన్‌‌లో అసెంబ్లీకి ఎన్నికలు 
  • పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయం
  • మీ సర్వేలు కాదు.. మా అంచనాలే నిజం
  • దొంగ ఏజెన్సీలు, దొంగ సర్వేలతో మాపై ఇంత దుష్ప్రచారమా?
  • రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందని రాస్తారా? అని ప్రశ్న
  • ఖమ్మం ‘రైతు ఆశీర్వాద సభ’ లో సీఎం ప్రసంగం 
  • చివరి విడత రూ.1,009 కోట్ల రైతు భరోసా నిధుల విడుదల
  • అసత్య ప్రచారకులను గ్రామాల్లో నిలదీయండి: డిప్యూటీ సీఎం భట్టి 

ఖమ్మం, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలు గెల్చుకొని, రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించబోరని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’లో సీఎం రేవంత్​ ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి విడత 1.44 లక్షల మందికి రూ.1,009.15 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. 

ములుగుమాడు రైతులకు ఈ-పాస్​ బుక్‌‌లను పంపిణీ చేశారు. మక్కజొన్న రైతులకు రూ.3,504 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా  రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ “మమతా బెనర్జీ పార్టీని, ఆప్​ పార్టీని చీల్చి వాళ్లు.. అనుకున్న బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు నరేంద్ర మోదీ, అమిత్ షా సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ విషయంలో వాళ్లు విజయం సాధించే అవకాశముంది. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబర్‌‌‌‌లో జరగవు. 2029 మే లేదా జూన్ నెలలో జరుగుతాయి. 

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26కు పెరుగుతాయి. 119 అసెంబ్లీ స్థానాలు 182  అవుతాయి.  వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం 36  నెలల ముందుగానే చెబుతున్నా. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇది భద్రాచలం రాములవారి మీద ఆన” అని వ్యాఖ్యానించారు.

నీ సర్వేలు కాదు.. నా అంచనాలే నిజం..

కాంగ్రెస్​ 65 సీట్లు, సీపీఐ ఒక సీటు గెలుస్తాయని 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు గాంధీభవన్​లో మీడియాకు ఆనాడే చెప్పానని రేవంత్‌‌రెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్​కు 64, ఉప ఎన్నికల్లో ప్రజలు రెండు సీట్లు ఇచ్చారన్నారు.

‘‘2023లో ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించి పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లోనే బందీ చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్వేలో కాంగ్రెస్ ఓడిపోతుందంటూ దుష్ప్రచారానికి దిగుతున్నారు. ఎన్నికలు ఎప్పుడో తెలియకుండా, రిజర్వేషన్లు ఎలా మారుతాయో తెలియకుండా ఎవరైనా సర్వేలు చేస్తారా? గెలుపు ఓటములు నిర్ణయిస్తారా..? జూబ్లీహిల్స్‌‌‌‌లో ఇలాగే చెబితే జనం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను బండకేసి కొట్టారు.. బ్యాడుమేళం బ్యాచ్‌‌‌‌లా బీఆర్ఎస్​ సర్వేల బ్యాచ్ తయారైంది.. రాస్కో చంద్ర శేఖర్ రావు.. నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలు గుర్తు పెట్టుకోండి వచ్చే  ఎన్నికల్లో కాంగ్రెస్​గెలిచి మరోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయం’’’ అని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. 

బావబామ్మర్దులకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేదని, ఒకే ఇంట్లో రెండు గుంపులు అయ్యాయన్నారు. ‘‘ఒకరిపై ఒకరు పోటీగా ఒకాయన కన్నెపల్లికి పోయి పంపులు ఆన్ చేయాలంటాడు. ఒకసారి మేడిగడ్డ కుంగితేనే ఇంత నష్టం జరిగింది. మళ్లీ నీళ్లు నింపితే భద్రాచలం రాముడు మునుగుతాడు. ఖమ్మం జిల్లాలో 44 ఊర్లు కొట్టుకుపోతాయి దుర్మార్గుడా.. నీ దుష్ట రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలా? అని అడిగితే సమాధానం లేదు. 

బీజేపీ లీడర్లతో మాట్లాడడం లేదని, ఆ పార్టీలోకి వెళ్లనని హరీశ్‌‌‌‌రావును భద్రాద్రి రామయ్య మీద, మేనమామ కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై ఒట్టేసి చెప్పమను. నువ్వు ఎక్కడుంటావో తెలియదు.. మీ బావ ఎటు పోతాడో తెలియదు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను బీజేపీలో విలీనం చేస్తారని నీ సొంత చెల్లెలే చెబుతోంది. ఆంధ్ర కాంట్రాక్టర్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు రూ.1400  కోట్లు ఇచ్చారని నీ సొంత చెల్లే చెప్పింది”అని కేటీఆర్‌‌‌‌పై రేవంత్‌‌‌‌రెడ్డి మండిపడ్డారు.

కరెంట్​తీగలు ముట్టుకుంటే మసైతరు.. 

కాంగ్రెస్​ పార్టీ వస్తే కరెంటు ఉండదన్న వాళ్లు కరెంటు వైర్​ పట్టుకుంటే కాకిలాగా మాడి మసై పోతరో.. లేదో.. నేనూ చూస్తానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ‘మా ప్రజా ప్రభుత్వం టీమ్​ రోజుకు 18 గంటలు పనిచేస్తోంది. రాష్ట్ర ప్రజలెవ్వరికీ అన్యాయం జరగనివ్వం. రైతు భరోసా ద్వారా రూ.9  వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. రాష్ట్ర రైతాంగ సంక్షేమానికి రూ.1.70 లక్షల కోట్లు ఖర్చుచేశాం. వరి వేస్తే ఉరే అని కేసీఆర్​ అంటే, మేం క్వింటాకు రూ.500 బోనస్​ ఇస్తున్నాం. 

ప్రతీ పేదవాడికి రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాం. రైతు భరోసా 12 వేలకు పెంచాం. రైతు రుణమాఫీ చేసి రుణవిముక్తులను చేశాం” అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సమయస్ఫూర్తితో ముందుకు నడిపిస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లబ్ధిదారులు కాంగ్రెస్​కు ఓట్లేస్తే, బీఆర్​ఎస్​కు డిపాజిట్లు కూడా దక్కవని రేవంత్ ఎద్దేవా చేశారు. 

ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నం: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రాన్ని కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం చేయ కుండా, ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని 
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.  2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ ధ్యేయమని చెప్పారు. గత పదేండ్లలో జరిగిన దోపిడీలను ప్రస్తావిస్తూ.. ఇకపై రాష్ట్రాన్ని ఆశ్రయించిన గుంటనక్కలను, తోడేళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం మొత్తం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినవారేనని, అందుకే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూనే, రాష్ట్ర భవిష్యత్తు కోసం దార్శనిక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. అవినీతికి తావు లేకుండా, పారదర్శకమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా మారుస్తామ ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవించడం, రైతన్నను రాజును చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన వడ్డీ లేని రుణాల పథకాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విస్మరించారని.. కానీ, తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం ఆ పథకాన్ని తిరిగి యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తున్నామని చెప్పారు. ​

ఐదేండ్లలో లక్ష కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రెండున్నర ఏండ్లలోనే సుమారు 67 వేల కోట్ల రూపాయలను మహిళలకు అందించామని ఆయన వెల్లడించారు. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని, మహిళల సౌకర్యం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించామని గుర్తు చేశారు. పవర్ ప్రాజెక్టులు, పెట్రోల్ పంపులు, క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సుల కొనుగోలులాంటి రంగాల్లో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్ది, వారిని కోటీశ్వరులుగా చూడటమే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

అసత్య ప్రచారాలపై గ్రామాల్లో  నిలదీయండి..

రైతుసంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, గత రెండున్నరేండ్లలోనే వ్యవసాయ రంగానికి రూ.1,67,877 కోట్లు ఖర్చు చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. కేవలం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి చేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. అభివృద్ధి బాటలో పయ నిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరా రు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిటారుగా నిలబడి, సాగునీరు అందిస్తుండగా, బీఆర్ఎస్ లక్ష కోట్ల ఖర్చుతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేక విఫలమైం దన్నారు. 

రూ.27 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును లక్షా40వేల కోట్లకు పెంచి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుప్పకూలే లా చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌‌‌‌రావుపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అవినీతి సొమ్ముతో మీడియా సంస్థలను కొనుగోలు చేసి, సోషల్ మీడియా, పత్రికల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మితే రాష్ట్రం మళ్లీ నాశనం అవుతుంది. అభివృద్ధిని అడ్డుకుంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారిని గ్రామాల్లోకి రాకుండా నిలదీయాలి”అని ప్రజలకు పిలుపునిచ్చారు.

పాలమూరు నాకు ప్రాణమైతే..ఖమ్మం జిల్లా గుండెకాయ..

రాజకీయంగా పాలమూరు జిల్లా తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని రేవంత్ రెడ్డి అన్నారు. ‘2023 జులైలో కాంగ్రెస్‌‌‌‌లో పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆర్ఎస్‌‌‌‌ను బొందపెట్టారు. సరిగ్గా ఇప్పుడు అదే జులైలో బీఆర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌ను మళ్లీ మొలకెత్తనివ్వమని చింతకాని సభకు లక్షలాదిగా తరలి వచ్చారు. ఖమ్మం జిల్లాలో ఇప్ప టికే బీఆర్ఎస్‌‌‌‌ను ప్రజలు నిషేధిం చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 26 పార్లమెంట్ స్థానాలకు 20 పార్లమెంట్ స్థానాలు గెలిపిద్దాం. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం. 5 లక్షల మందితో మళ్లీ మధిరలో రాహుల్‌‌‌‌తో బహిరంగ సభను ఏర్పాటు చేసుకుందాం.

రైతు భరోసా నిధుల విడుదల ఇలా..


తేదీ    భూ పరిమితి     రైతులు    (రూ. కోట్లలో)

జూన్ 30    ఒక ఎకరం లోపు    26.55 లక్షలు    878.93
జూన్ 30    2 ఎకరాల లోపు    17.72 లక్షలు    1,603.08
జులై 1, 2    3 ఎకరాల లోపు    10.68 లక్షలు    1,590.02
జులై 1, 2    4 ఎకరాల లోపు    6.39 లక్షలు    1,330.32
జులై 3    5 ఎకరాల లోపు    4.41 లక్షలు    1,187.99
జులై 4    6 ఎకరాల లోపు    1.68 లక్షలు    545.40
జులై 6, 7    7 ఎకరాల లోపు    92,729    354.95
జులై 6, 7    8 ఎకరాల లోపు    58,831    259.72
జులై 10    8 ఎకరాల పైన    1.44 లక్షలు    1,009.00
మొత్తం    --    71.38 లక్షలు    8,759.45