సింగరేణికి చెందిన ఐదు గనులకు ఫైవ్స్టార్ రేటింగ్...7 విభాగాల్లోని 50 అంశాలను పరిశీలించిన కేంద్రం

సింగరేణికి చెందిన ఐదు గనులకు ఫైవ్స్టార్ రేటింగ్...7 విభాగాల్లోని 50 అంశాలను పరిశీలించిన కేంద్రం
  •     సింగరేణి చరిత్రలో అత్యధికంగా ఐదు గనులకు ఫైవ్ స్టార్
  •     అధికారులకు, కార్మికులకు అభినందనలు తెలిపిన భట్టి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సింగరేణి సంస్థకు చెందిన ఐదు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ లభించింది. కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం.. శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్.కె న్యూటెక్, ఆర్.కె-6 గనులు, సత్తుపల్లి ఏరియాకు చెందిన జె.వి.ఆర్ ఓసి-2, బెల్లంపల్లి ఏరియాకు చెందిన ఖైరిగూడ ఓపెన్ కాస్టు గని, అలాగే రామగుండం-3 ఏరియాకు చెందిన ఆర్.జి ఓసి-1 గనులు అవార్డులకు ఎంపికయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన మొత్తం 382 గనులు రేటింగ్ కోసం పోటీపడగా.. కేంద్రం కేవలం 50 గనులను ఎంపిక చేసింది. అందులో మన రాష్ట్రం నుంచే ఐదు గనులు ఉండటం విశేషమని సింగరేణి అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

గతేడాది నాలుగు గనులకు ఈ గుర్తింపు రాగా.. ఈసారి సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఐదు గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావడం గమనార్హం. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. గనుల అధికారులు, కార్మికులు, సిబ్బందికి తన ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన గనులు కూడా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కాగా..కేంద్ర బొగ్గు శాఖకు చెందిన 'కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్' ఏటా బొగ్గు గనుల్లో సాంకేతికత, పర్యావరణం, కార్మిక సంక్షేమం, భద్రత వంటి 7 ప్రధాన విభాగాల్లోని 50 అంశాలను నిపుణుల బృందాల ద్వారా ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. ఈ తనిఖీల్లో నూటికి 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన గనులకు 'ఫైవ్ స్టార్' రేటింగ్, అలాగే 80 నుండి 90 శాతం మార్కులు సాధించిన గనులకు 'ఫోర్ స్టార్' రేటింగ్ ఇస్తారు.