- షూటింగ్ చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులు
- చీటింగ్ కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు
గచ్చిబౌలి, వెలుగు: ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూలు చేసి.. చీటింగ్ చేసిన డైరెక్టర్ గుడ్లూరి అశోక్బాబు, అతని భార్య విజయలక్ష్మిపై సైబారాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. కూకట్పల్లి భాగ్యనగర్‌కాలనీకి చెందిన నాయుడు హనమంతరావు బిజినెస్ చేస్తుంటాడు. హనమంతరావుకు నయీం అనే వ్యక్తి ద్వారా పిల్ల జమిందార్, భాగమతి, ఆకాశరామన్న సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అశోక్బాబు, అతని భార్య విజయలక్ష్మి పరిచయం అయ్యారు. తాము ఒక సినిమా తీస్తున్నామని, అందులో మీ కుమారుడిని హిరోగా పరిచయం చేస్తామని చెప్పారు. అంతే కాకుండా సినీ పరిశ్రమలో మరిన్నీ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
సినిమా బడ్జెట్ రూ.8 కోట్లు అవుతుందని, ఆరు నెలల్లో లాభాలతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన హనమంతరావు.. డైరెక్టర్ అశోక్‌బాబుకు 2024 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 2వ తేది వరకు దశల వారీగా రూ.3.05 కోట్ల డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత మరో రూ. 45 లక్షల చెక్‌ను కూడా ఇచ్చాడు. 2024లో హనమంతరావు కొడుకు హిరోగా డైరెక్టర్ అశోక్బాబు సినిమా షూటింగ్ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా డబ్బు మొత్తం అశోక్బాబు తన వద్ద పెట్టుకున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి చేయాలని, లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వాలని హనమంతరావు డిమాండ్ చేయడంతో డైరెక్టర్ అశోక్బాబు రూ. 4.50 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చి రూ. 50 లక్షల విలువైన నాలుగు చెక్కులు ఇచ్చాడు.
గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో డైరెక్టర్ అశోక్‌బాబును హనమంతరావు నిలదీయగా.. నీ కుమారుడికి ఫ్యూచర్ లేకుండా చేస్తామని, డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా డైరెక్టర్ బెదిరింపులకు గురిచేయడంతో హనమంతరావు 2025 మే 8వ తేదీన కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు ఈఓడబ్ల్యూకు ట్రాన్స్ఫర్ చేశారు. జూన్ 10న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు డైరెక్టర్ అశోక్బాబు అతని భార్య విజయలక్ష్మి, మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
