- సర్ గడువు మరో రెండు నెలలు పొడిగించండి
- ఈసీకి బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు, వినోద్ కుమార్ బృందం విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)కు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే, రాష్ట్రంలో ఓటరు జాబితాల ప్రక్షాళన జరగాలంటే సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను తొలిగించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్(ఎన్నికల సంఘ ప్రధాన కార్యాలయం)లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్‌ల ప్రతినిధి బృందం సమావేశం అయింది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు, డూప్లికేట్ ఓట్ల జాబితా, సర్ గడువు పెంచాలని 9 పేజీల వినతి పత్రాన్ని అందజేసింది. అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తమ పార్టీ అధ్యయనంలో తేలిందన్నారు.రాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కొంతమంది రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకున్నార్నారన్నారు. డూప్లికేట్ ఓటర్లే అభ్యర్థి గెలుపు, ఓటమిలో కీలక పాత్ర పోశిస్తున్నారని చెప్పారు. వెంటనే డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరినట్లు వెల్లడించారు.
ఒక్కోసెగ్మెంట్ లో సగటున16 వేల డూప్లికేట్ ఓట్లు..
డూప్లికేట్ ఓట్లు తొలగించే టెక్నాలజీ తమ వద్ద ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తమకు తెలిపారని వద్దిరాజు చెప్పారు. అయితే, సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు ఉంటే తొలగించే పరిజ్ఞానం, అధికారం తమకు లేదని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని సూచించారన్నారు. అందుకే కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలిసి దేశవ్యాప్తంగా నకిలీ ఓట్లు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా119 నియోజక వర్గాల్లో సరాసరిగా16 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయన్నారు. అత్యధికంగా మహబూబ్ నగర్‌లో 56 వేల డూప్లికేట్ ఓట్లు ఉండగా.. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో 36 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు.
'టీఆర్ఎస్' పేరు ఈసీ డిసైడ్ చేస్తది..
కవిత పార్టీకి టీఆర్ఎస్ పేరు ఖరారుపై కేంద్ర ఎన్నికల కమిషనే తుది నిర్ణయం తీసుకుంటుందని మాజీ ఎంపీ వినోద్ అన్నారు.ఈ పేరుపై సుమారు వెయ్యికి పైగా అభ్యంతరాలు అందాయని గతంలో ఈసీ వెల్లడించింది. దీనిని ఈసీనే నిర్ణయిస్తది” అని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి చెందిన రూ. 1,400 కోట్లను అమరుల కుటుంబాలకు ఇవ్వాలన్న కవిత డిమాండ్‌ను సున్నితంగా తిరస్కరించారు.
