V6 News

ఇండియాపై నెట్​ఫ్లిక్స్​ గురి

ఇండియాపై నెట్​ఫ్లిక్స్​ గురి

     రూ.2,870 కోట్ల పెట్టుబడులు

    10 కోట్ల మంది కొత్త సబ్​ స్క్రైబర్లు ఇండియన్లే ఉంటారు

    ‘ఇండియా కంటెంట్​’తో ఇకపై షోలు, సినిమాలు

    కంటెంట్​ ఉంటే ఎంతపెట్టైనా చూస్తారు

    కంపెనీ సీఈవో రీడ్​ హేస్టింగ్స్​

ఇండియా మార్కెట్​పై నెట్ ఫ్లిక్స్​ గురిపెట్టింది. అమెజాన్​ప్రైమ్​, హాట్​స్టార్​ బాటలోనే పెట్టుబడులకు రెడీ అయిపోతోంది. కస్టమర్ల బేస్​ పెంచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ ఏడాదికిగాను సుమారు రూ.2,870 కోట్లు ఇన్వెస్ట్​ చేయడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని నెట్​ఫ్లిక్స్​ సీఈవో రీడ్​ హేస్టింగ్స్​ వెల్లడించారు. ఇటీవల జరిగిన హిందూస్థాన్​ టైమ్స్​ లీడర్​షిప్​ సమ్మిట్​కు హాజరైన ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ప్రత్యేకంగా ‘ఇండియా కంటెంట్​’కు ఇక్కడ ప్రాధాన్యమిస్తామని చెప్పారు. అయితే, ఇప్పటికే ఇండియాలో జరిగిన సంఘటనల ఆధారంగా ఇప్పటికే కొన్ని సిరీస్​లు, సినిమాలను ప్రసారం చేసిన నెట్​ఫ్లిక్స్​, ఇకపై చేయబోయే సినిమాలు, సిరీస్​లేంటో మాత్రం ఆయన చెప్పలేదు.

ఇది ఆరంభమే

ఆన్​లైన్​ స్ట్రీమింగ్​కు ఇండియాలో స్కోప్​ ఉందని రీడ్​ హేస్టింగ్స్​ చెప్పారు. అయితే, తమకు మాత్రం ఇది జస్ట్​ ఆరంభం మాత్రమేనని, మున్ముందు కస్టమర్​ బేస్​ పెంచుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఎంత మంది సబ్​స్క్రయిబర్లున్నారన్నది మాత్రం చెప్పలేదు. కానీ, తర్వాత చేరబోయే 10 కోట్ల మంది సబ్​స్క్రయిబర్లు ఇండియా నుంచే ఉంటారని అన్నారు. ‘‘ఇండియాలో ఇంటర్నెట్​ గ్రోత్​ బాగా పెరిగిపోతోంది. వాడకమూ ఎక్కువైంది. కాబట్టి మాకు సబ్‌స్క్రయిబర్లు పెరగడానికి అదే తోవ చూపిస్తుంది’’ అని అన్నారు. కాగా, ఇండస్ట్రీ అనలిస్టులు, మీడియా పార్ట్​నర్స్​ ఆసియా అంచనాల ప్రకారం గత ఏడాది ఇండియాలో నెట్​ఫ్లిక్స్​కు 20 లక్షల మంది సబ్​స్క్రయిబర్లున్నారు. గత ఏడాది సెప్టెంబర్​ నాటికి ప్రపంచమంతా నెట్​ఫ్లిక్స్​కు 16 కోట్ల మంది సబ్​స్క్రయిబ్​ చేసుకున్నారు.

ఇండియా కంటెంట్​కు ప్రపంచమంతా ఆదరణ

ఇండియా కంటెంట్​ను ప్రపంచమంతా ఆదరిస్తోందని రీడ్​ చెప్పారు. ఇండియాను దాటి గ్లోబల్​ ఆడియన్స్, ఆ కంటెంట్​ను చూస్తున్నారన్నారు. నెట్​ఫ్లిక్స్​లో ప్రసారమైన చిల్డ్రెన్స్​ యానిమేటెడ్​ షో ‘మైటీ లిటిల్​ భీమ్​’ను ప్రపంచ వ్యాప్తంగా 2.7 కోట్ల మంది చూశారని, ఇండియాకు సంబంధించిన కంటెంట్​ను ఆదరిస్తున్నారనడానికి ఇదే ఉదాహరణ అని వివరించారు. ‘‘రాబోయే ఐదు, పదేళ్లు టెలివిజన్​కు స్వర్ణయుగం. ఈ రంగంలో పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. యాపిల్​, అమెజాన్​, డిస్నీ, వయాకామ్​ వంటి కంపెనీలు ఇప్పటికే అందులోకి అడుగుపెట్టాయి. అందరూ ఇండియాపైనే దృష్టిపెట్టారు. బ్రిటన్​, అమెరికాతో పాటు ఇండియా నుంచీ కంటెంట్​ ఎక్కువగా వస్తోంది’’ అని అన్నారు.

ఢిల్లీ క్రైమ్​.. సేకెర్డ్​ గేమ్స్​

2016లో ఇండియా సహా 190 దేశాల్లో నెట్​ఫ్లిక్స్​ లాంచ్​ అయింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు వచ్చిన ఇండియన్​ కంటెంట్​ తక్కువే. అయితే, పోయిన సంవత్సరం నెట్​ఫ్లిక్స్​లో ప్రసారం అయిన ‘సేకెర్డ్​ గేమ్స్​’ ఇంటర్నేషనల్​ ఎమ్మీ అవార్డ్స్​కు నామినేట్​ అయింది. అండర్​వరల్డ్​ కథాంశంగా విక్రమ్​ చంద్ర అనే ఇండియన్​ అమెరికన్​ రైటర్​ రాసిన ‘సేకెర్డ్​ గేమ్స్​’ అనే అండర్​నవల ఆధారంగా నెట్​ఫ్లిక్స్​ దానిని తెరకెక్కించింది. దానిని ప్రపంచమంతా హిట్​ చేసింది. ఇక, 2012 ఢిల్లీ గ్యాంగ్​ రేప్​ ‘నిర్భయ’ స్టోరీ ఆధారంగా ‘ఢిల్లీ క్రైమ్​’ అనే స్టోరీ కూడా నెట్​ఫ్లిక్స్​లో మంచి హిట్​ అయింది. ఘటన జరిగిన తీరు, పోలీసుల దర్యాప్తుపై రిచీ మెహతా ఆ స్టోరీని డైరెక్ట్​ చేశారు. అయితే, ఆ స్టోరీని తీయొద్దని కొందరు చెప్పినా, ఆర్టిస్టిక్​ ఫ్రీడమ్​తో దానిని ముందుకు తీసుకెళ్లామని రీడ్​ తెలిపారు.

కంటెంట్​ ఉంటే ఎంతపెట్టైనా చూస్తారు

అమెజాన్​ ప్రైమ్​, డిస్నీ హాట్​స్టార్​లాగే గత ఏడాది జులైలో నెట్​ఫ్లిక్స్​ కూడా ప్రత్యేకంగా ఇండియా కోసం ఓ మొబైల్​ ఓన్లీ ప్లాన్​ తీసుకొచ్చింది. రూ.199 ప్లాన్​తో కొత్త సబ్​స్క్రైబర్లకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​ బేసిక్​ సర్వీస్​కున్న చార్జీలతో పోలిస్తే చాలా తక్కువని కంపెనీ చెబుతోంది. మామూలు సబ్​స్క్రిప్షన్​ రేటు నెలకు రూ.500 అని చెబుతోంది. అయితే, అమెజాన్​, హాట్​స్టార్​లు మాత్రం ఏడాది సర్వీస్​కు రూ.999 చార్జ్​ చేస్తున్నాయి. వాటితో పోలిస్తే మాత్రం నెట్​ఫ్లిక్స్​ కాస్ట్​ కొంచెం ఎక్కువేనన్న వాదనలున్నాయి. కానీ, ఆ వాదనలను తోసిపుచ్చుతున్నారు రీడ్​ హేస్టింగ్స్​. కంటెంట్​ ఉందనుకుంటే కస్టమర్లు ఎంతపెట్టైనా సబ్​స్క్రయిబ్​ చేసుకుని చూస్తారంటున్నారు. ‘‘మనం మంచి కంటెంట్​ ఇస్తే, ఎంతైనా పెట్టేందుకు కస్టమర్లు రెడీగా ఉంటారు. అమెరికాలో కేబుల్​ టెలివిజన్​ కాస్ట్​ దాదాపు 75 డాలర్లు (సుమారు రూ.5,400) ఉంటుంది. అదే ఇండియాలో జస్ట్​ 3 నుంచి 5 డాలర్లే (రూ.200 నుంచి రూ.350) ఖర్చు అవుతుంది. ఆ లెక్కన ఇక్కడ అయ్యే ఖర్చు తక్కువే. మార్కెట్​కు మాత్రం మంచి డిమాండ్​ ఉంది. కాబట్టి రూ.199 అంటే నా దృష్టిలో తక్కువే’’ అని అన్నారు.

కంటెంట్​ రెగ్యులేషన్లో అర్థం లేదు

కంటెంట్​పై స్వీయ నియంత్రణ కోసం పాలసీలు రూపొందిస్తున్నామని రీడ్​ హేస్టింగ్స్​ చెప్పారు. ‘‘ప్రతి దేశానికి కంటెంట్​పై ఏదో ఒక సమస్య ఉంటుంది. చాలా మంది యూట్యూబ్​, నెట్​ఫ్లిక్స్​, అమెజాన్​ వంటి సంస్థలు కచ్చితంగా ప్రసారంలో ప్రమాణాలు పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. ఆ మాటల్లో అసలు అర్థం లేదు. టీవీల్లాగా ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ ప్రతి ఇంటికీ చేరదు. కాబట్టి సెల్ఫ్​ రెగ్యులేషన్​ అనేది అర్థం లేని విషయం’’ అని అన్నారు. సేకెర్డ్​ గేమ్స్​లోని కొన్ని సీన్లపై ఇటీవల ఇండియాలో అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీని అవమానపరిచేలా సీన్లున్నాయంటూ కోర్టులో పిటిషన్​ వేశారు. ఆ కేసు ఇంకా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ కామెంట్​ చేశారు. ఎంటర్​టైన్​మెంట్​కు సంబంధించి ఏదో ఒక వివాదం రేగుతూనే ఉంటుందన్నారు.