
టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన నాలుకను నోటితో తాకాలంటూ ఓ బాలుడిని దలైలామా కోరడం తాజాగా తీవ్ర వివాదాస్పదమైంది. తన వద్ద ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చిన ఓ భారతీయ బాలుడిని దగ్గరకు తీసుకొని.. అతడి పెదవులపై దలైలామా ముద్దు పెట్టినట్లు వీడియోలో ఉంది.
అనంతరం బౌద్ధ గురువు తన నాలుకను బయటపెట్టి.. ‘నీ నోటితో నా నాలుకను తాకుతావా’ అని అడగడం వినిపించింది. దీంతో- ఆయన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనను సహించకూడదని, ఆయన్ను అరెస్టు చేయాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు.
దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు.
అయితే ఓ నెటిజన్ మాత్రం సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు. టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు.