- భర్త తిట్టాడన్న మనస్తాపంతో భార్య..
- విషయం తెలియడంతో భర్త ఆత్మహత్య
కొండపాక, వెలుగు : ప్రేమించి పెండ్లి చేసుకున్న దంపతులు నెల రోజులకే సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక గ్రామానికి చెందిన దండ్ల అంజలి (21), కొమురవెల్లి గ్రామానికి చెందిన దేశెట్టి వినయ్ (23) ప్రేమించుకొని గత నెల 9న పెద్దల సమక్షంలో పెండ్లి చేసుకున్నారు.
అప్పటి నుంచి భార్యభర్తలు కొమురవెల్లిలోనే ఉంటున్నారు. మూడు రోజుల కింద అంజలి కడుపునొప్పి వస్తుందని చెప్పడంతో వినయ్ ఆమెను కొండపాకలో దింపి, హైదరాబాద్‌కు వెళ్లాడు. వినయ్ అంజలికి ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ అని వస్తుండడంతో ఎవరితో మాట్లాడుతున్నావని తిట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన అంజలి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు అంజలి మృతి విషయాన్ని వినయ్‌కి చెప్పారు. దీంతో అతడు హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి బయలుదేరాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని రాయవరం గ్రామం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన లొకేషన్‌ను ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. దీంతో వారు అక్కడికి రాగా.. అప్పటికే చనిపోయాడు. ఇరువర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
