ఇంజినీరింగ్‌‌లో ఈ ఏడాది నుంచే కొత్త ఫీజులు!..ఈ కాలేజీల్లో రెండు లక్షలకు పైనే

ఇంజినీరింగ్‌‌లో ఈ ఏడాది నుంచే కొత్త ఫీజులు!..ఈ కాలేజీల్లో రెండు లక్షలకు పైనే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ అకాడమిక్​ఇయర్‌‌‌‌నుంచే కొత్త ఫీజులు అమల్లోకి రానున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కాలేజీలవారీగా ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌‌ఆర్సీ) ఈ నెలాఖరు నాటికి ఖరారు చేయనున్నది. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025–26, 2026–27, 2027–28  విద్యా సంవత్సరాలకుగానూ కొత్త ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కాలేజీల నుంచి అప్లికేషన్లు తీసుకొని, వాటి ఆదాయ, వ్యయాలనూ పరిశీలించింది. 

ఈ క్రమంలో 157 ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను ప్రాథమికంగా ఫైనల్ చేసింది. దీంట్లో ఏకంగా 4  కాలేజీల్లో 2 లక్షలకు పైగా, మరో సగానికి పైగా కాలేజీల్లో లక్షకు పైగా ఫీజులు ఉండేలా ప్రతిపాదనలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే, కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పరిశీలించాలని సూచించింది. 2025–26 విద్యా సంవత్సరంలో పాత ఫీజులనే కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కొన్ని ప్రైవేటు కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే, విద్యాప్రమాణాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తామని కోర్టుకు  సర్కారు తెలిపింది. ఈ నేపథ్యంలోనే 6 వారాల్లో కొత్త ఫీజులను నిర్ణయించాలని ఆదేశించింది.  మరోసారి ఆదాయ వ్యయాలతోపాటు అకాడమిక్ అంశాలనూ పరిగణనలోకి తీసుకొని, ఫీజులను నిర్ణయించే పనిలో టీఏఎఫ్‌‌ఆర్సీ నిమ్నమైంది. ఇప్పటికే కాలేజీల మేనేజ్‌‌మెంట్లతో హియరింగ్ నిర్వహించింది. ఫీజుల ఖరారుపై పలుమార్లు సమావేశమైంది. 

కొత్త ఫీజులపై సమీక్ష    

హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌‌లో టీఏఎఫ్ఆర్సీ కమిటీ గురువారం సమావేశమైంది. దీనికి కమిటీ చైర్మన్ గోపాల్‌‌రెడ్డి, విద్యాశాఖ సెక్రెటరీ యోగితారాణా, టీజీసీహెచ్‌‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్​ కమిషనర్ శ్రీదేవసేన, తదితరులు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ఫీజులపై సమీక్షించారు. ఈ నెల 22,23వ తేదీల్లో మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. త్వరలోనే వీటిని ఫైనల్ చేసి, సర్కారు ద్వారా కోర్టుకు అందించే అవకాశం ఉంది. అయితే, పాత బ్లాక్ పీరియడ్‌‌తో పోలిస్తే స్వల్పంగా ఫీజులు పెరిగే అవకాశమున్నట్టు తెలిసింది. విద్యార్థులకు ఇబ్బంది కాకుండా కొత్త ఫీజులను టీఏఎఫ్‌‌ఆర్సీ ప్రాథమికంగా ఖరారు చేసినట్టు సమాచారం.